NationalNews

సింహాలపైనా సిల్లీ రాజకీయాలు

Share with

కొందరికి దేశ భక్తి పేరుకు మాత్రమే ఉంటుంది. కొందరికి దేశ భక్తి నరనరాల్లో ఉంటుంది. దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ స్ఫూర్తి మంత్రంగా ప్రధాని నరేంద్ర మోడీ ఎనిమిదేళ్లుగా పాలన సాగిస్తున్నారు. దేశానికి కొత్త పార్లమెంట్ భవనాన్ని కట్టి… ఆ స్ఫూర్తిని దేశ ప్రజలకు అందించాలని ప్రధాని మోదీ భావిస్తుంటే… కొందరు ఆ ప్రక్రియను కించపర్చేలా రాజకీయాలు చేస్తున్నారు. దేశ ఆత్మగౌరవ చిహ్నమైన నాలుగు సింహాలను సైతం ఇప్పుడు రాజకీయం చేస్తూ విపక్షాలు పబ్బంగడుపుకుంటున్నాయ్… ఇన్నాళ్లూ నోరు తెరుచుకొని ఉన్న సింహాలు… ఇప్పుడు గాండ్రిస్తుంటే… ఇన్నాళ్లూ మూసుకున్న నోళ్లు.. ఒక్కసారిగా రంకెలుపెడుతున్నాయ్… దేశానికి ఏది మంచో ఏది చెడో తెలియని రోజుల నుంచి.. దేశానికి ఇదే మంచి అన్న స్ఫూర్తితో ముందుకు కదలుతోంది ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు.

ఐతే నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనంపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నంపై ఇప్పుడు రాజకీయ దుమారం రేగుతోంది. సింహాలు నోరు మూసుకోవడంలో ఉన్న హుందా… రాజసం… ఆత్మవిశ్వాసం.. గ్రాండిస్తున్నప్పుడు కన్పించడం లేదంటూ నానా యాగీ చేస్తున్నాయ్ విపక్షాలు. దేశం ముందుకు పురోగమిస్తున్న సంకేతాల తరహాలో సింహాలు గర్జిస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారు కొందరు కుహనావాదులు. తెలుగువీర లేవరా అంటూ దశాబ్దాల క్రితం శ్రీశ్రీ రాసిన నాటి సినీ పాటను ఇక్కడ చెప్పుకోవాలి… ఈ దేశం… ఈ రాజ్యం… నాదేనని చాటించి… ప్రతి మనిషి తొడలు కొట్టి… శృంఖలాలు పగలగొట్టి… చుర కత్తులు పదును పట్టి… తుది సమరం మొదలుపెట్టి –సింహలై గర్జించాలి… అన్నట్టుగా నేడు పరిస్థితులు దాపురించాయ్. ఇలాంటి తరుణంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు… దేశంలో అవ్యవస్థలను ఖండ ఖండాలుగా చీల్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి బాసటగా నిలవాల్సిన రాజకీయాలు ఇప్పుడు వ్యక్తిగత కక్షతో గాండ్రిస్తున్నాయ్. ప్రధాని మోదీ కోరుకుంటున్న భారతం ఇదేనా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నాయ్ విపక్షాలు… జాతీయ చిహ్నాన్ని అవమానించారంటూ తృణముల్ కాంగ్రెస్ విమర్శిస్తే… గిర్ సింహం ఫోటోలా సింహాలున్నాయంటూ విమర్శించారు కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి. సింహాలు మనుషుల్ని తినేలా ఉన్నాయంటూ ఆర్జేడీ నేతలు ఆరోపించారు. ఐతే దేశ ప్రతిష్టను మసకబారేలా చేసారంటూ… మరికొన్ని పక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయ్.

ఢిల్లీ నడిబొడ్డున కొత్త పార్లమెంట్ పైన ఏర్పాటు చేసిన 4 సింహాల కాంశ్య విగ్రహం ఇప్పుడు వివాదానికి కారణమవుతోంది. 9500 కిలోల కంచుతో చేసిన జాతీయ చిహ్నం ఇప్పుడు దేశ ఆత్మగౌరవ పతాకగా నిలుస్తోంది. 1860లో నాటి బ్రిటీష్ ఏలుబడిలో ఉన్న చిహ్నానికి… నేటికీ మార్పు రానక్కర్లేదా… విపక్షాలకు ఈ మాత్రం తెలివి లేదా అన్పిస్తోంది. ఐతే కాంశ్య విగ్రహాన్ని రూపొందించిన కళాకారులు ఆ విమర్శలను తిప్పికొట్టారు. సింహాలను పెద్దవిగా చేయడం వల్ల… అన్ని విషయాలపై ఫోకస్ అవుతున్నాయన్నారు. పార్లమెంట్ ముందు ఏర్పాటు చేసిన నాలుగు సింహాలు… అశోకుని స్థూపంపై ఉన్నట్టుగా 99 శాతం ఉన్నాయని… కొందరు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు ప్రాజెక్టు డిజైనర్ శిల్పి సునీల్ డియోర్. వాస్తవ స్థూపానికి రెండున్నర అడుగులు మాత్రమే అదనంగా పెంచామని చెప్పుకొచ్చారు. 100 మీటర్ల దూరంలో చూసినా… సింహాలు ఒకేలా కన్పిస్తాయన్నారు. సింహం ఎప్పుడూ శాంతి సందేశాన్నే ఇస్తుందని… కోపంతో పరిష్కారాలు లభించవని కళాకారులు చెప్పుకొచ్చారు.