లోకేష్ కిం కర్తవ్యం.. ఏం చేసినా కలిసిరావట్లేదా?
లోకేష్ పాదయాత్రకు వరుస ఆటంకాలు
మొదట్నుంచి కలిసిరాని పాదయాత్ర
పాదయాత్రలో గుండెపోటు తారకరత్న మృతి
అంతంత మాత్రంగానే లోకేష్ పాదయాత్రకు రెస్పాన్స్
స్పీడప్ అందుకుంటున్న తరుణంలో తండ్రి అరెస్ట్
చంద్రబాబు అరెస్ట్‌తో ఆగిన పాదయాత్ర
రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఎలా క్లిక్ అవుతారన్నది ఊహాతీతం. కొన్నిసార్లు అసలు రాజకీయాలకు పనికిరారు అనుకున్నవాళ్లు సత్తా చాటుతారు. రాజకీయాలు వీళ్ల వల్ల కాదనుకున్నవారు అద్భుతాలు చేస్తుంటారు. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలు మాత్రమేనన్న నానుడి చరిత్ర మొదలు రుజవవుతూనే ఉంది. టీడీపీ ఇప్పుడు క్రాస్ రోడ్స్ లో ఉంది. ఆ పార్టీ వచ్చే రోజుల్లో ఎలా ముందడుగు పడుతుందన్నదానిపై ఎంతో యాంబిగ్విటీ ఉంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్కిల్ డవలప్మెంట్ స్కామ్‌లో 42 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉండటంతో.. పార్టీ ఎలా ముందడుగేస్తోంది.. తనయుడు నారా లోకష్ పార్టీని ఎలా ముందుకు నడిపిస్తారన్నదానిపై ఎంతో తర్జనభర్జన ఉంది.

తండ్రికి తగ్గ వారసుడు అన్పించుకోవాలన్న ఉద్దేశంతో నారా లోకేష్ మహా పాదయాత్ర స్టార్ట్ చేశారు. పార్టీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం, తండ్రికి తగ్గ తనయుడనిపించుకోవాలన్న ఆరాటం, లోకేష్‌ను పాదయాత్ర వైపు అడుగు పెట్టించింది. వాస్తవానికి పాదయాత్ర చేసినవారందరూ హీరోలైపోలేదు. ముఖ్యమంత్రులు కాలేదు. కానీ లోకేష్‌కు కొండంత అంత తన తండ్రి నారా చంద్రబాబునాయుడు ఉన్నారు. దీంతో ఆయన ఏం చేసినా, ఏం చేయాలనుకుంటున్నా చెల్లుతుందన్న విశ్వాసం మెండుగా ఉంది. పెద్దగా రెస్పాన్స్ రానప్పటికీ… లోకేష్ పాదయాత్రను కొనసాగిస్తూ వచ్చారు. ఎన్నికల్లో పార్టీ తరుపున పోటీ చేయాలనుకున్నవారందరికీ లోకేష్ యాత్ర రిహార్సిల్స్ గా ఉపకరించింది. అయితే పాదయాత్ర ప్రారంభించిన రోజే తారకరత్నకు స్ట్రోక్ రావడం ఆ తర్వాత ఆయన సుదీర్ఘకాలం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం.. మొత్తంగా లోకేష్ కు అది తొలి దెబ్బగా చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత తేరుకొని పాదయాత్ర ముందుకు సాగిస్తున్నప్పటికీ రాయలసీమలో అంతగా రియాక్షన్ రాలేదు.

కానీ యాత్ర నెల్లూరు, ప్రకారం చేరే సరికి వేగం పెరిగింది. పాదయాత్రలో ఆయనేం చేస్తున్నారు. ఎలా మాట్లాడుతున్నారు. ఎంత సేపు నడుస్తున్నారు. ఏ సమయం నుంచి ఏ సమయం వరకు నడుస్తున్నాడన్న విషయాలను విమర్శకులు మోత మోగించేలా దుయ్యబట్టినా లోకేష్ తన లక్ష్యం ప్రకారం యాత్రను కొనసాగిస్తూ వచ్చారు. గుంటూరు చేరే సరికి యాత్రను స్పీడప్ చేశారు. కృష్ణా జిల్లాలోనూ అలాగే సాగింది. చిన్నగా గోదావరి జిల్లాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. అప్పటికే పవన్ కల్యాణ్ రెండు, మూడు దఫాలుగా వారాహి యాత్ర చేయడంతో లోకేష్ యాత్ర సోసోగా సాగింది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్ట్‌తో సీన్ మారిపోయింది. జగన్, చంద్రబాబును అరెస్ట్ చేసే సాహసం చేస్తారా అన్న మీమాంశ టీడీపీలో ఉన్నప్పటికీ.. ఈ రకంగా పొజిషన్ టైట్ గా ఉంటుందని మాత్రం లోకేష్ గానీ, టీడీపీ నాయకులుగానీ ఊహించలేకపోయారు. దీంతో 42 రోజులుగా చంద్రబాబు జైలు జీవితం గడుపుతున్నారు.

చంద్రబాబు బయట ఉన్నప్పుడు లోకేష్ పాదయాత్రను నేరుగా ఆయన మానిటర్ చేసేవారు. కానీ ఇప్పుడు చంద్రబాబు జైల్లో ఉంటే ఆయనను ఎలా బయటకు తీసుకురావాలన్నదానిపై టీడీపీ నాయకులందరూ ప్రయత్నిస్తున్నా సఫలం కాలేకపోతున్నారు. నిప్పు లేనిదే పొగ రాదుకదా అన్న చర్చ ఇప్పుడు టీడీపీ నాయకులు గుండెల్లో గుణపాలు దించుతున్నాయ్. చంద్రబాబును అన్యాయంగా, అక్రమంగా నిర్భందిస్తే.. న్యాయస్థానాలు చూస్తూ ఊరుకుంటాయా అన్న చర్చ కూడా జోరందకుంది. నిజం గెలవాలంటూ నారా భువనేశ్వరి యాత్ర కూడా చేసే అవకాశముందంటున్నారు. ఒకవేళ నిజం గెలిస్తే ఏమవుతుందోనన్న టెన్షన్ కూడా నారా, నందమూరి ఫ్యామిలీలను వేధిస్తోంది.

ఇలాంటి తరుణంలో లోకేష్ పాదయాత్ర ముందుకు సాగడం కష్టంగానే ఉంది. ఒకవేళ మమ అని అన్పించాలనుకున్నప్పటికీ అది కష్ట సాధ్యమే. అందుకే చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న నియోజకవర్గాల యాత్రలను కంటిన్యూ చేస్తూ.. అటు పార్టీ నేతలకు, కేడర్‌కు లోకేష్ దిశానిర్దేశం చేసే అవకాశం కన్పిస్తోంది. అందుకే తాత్కాలికంగా పాదయాత్రను సైతం హోల్డ్ చేసే అవకాశం ఉంది. మొత్తంగా ఇప్పుడు నారా లోకేష్ టైమ్ బ్యాడ్ అన్నది కాకుండా.. టైమ్ ఎప్పుడొస్తుందా అన్న కసితో పనిచేయాల్సి ఉంది.

