కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసిన నారా లోకేష్
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. తమ కుటుంబాన్ని వ్యక్తిగతంగా కక్ష కట్టి వెంటాడుతున్నారని ఆరోపించారు. కేంద్రమంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో కలిసి ఢిల్లీ వెళ్ళిన లోకేష్ ఈ మేరకు ఫిర్యాదు చేశారు. జగన్ కక్ష సాధింపు చర్యలను అమిత్ షా దృష్టికి ఆయన తీసుకెళ్లారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ విచారణ పేరుతో తనని వేదిస్తున్న జగన్ కక్ష సాధింపు చర్యలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఆఖరికి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి ని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అమిత్ షా కు వివరించారు. చంద్రబాబు పై ఎన్ని కేసులు పెట్టారు నీపై ఎన్ని కేసులు పెట్టారు అని లోకేష్ ని అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. కక్ష సాధింపు తో జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులు, ట్రైల్ కోర్టు, హై కోర్టు, సుప్రీం కోర్టు పరిధిలో వివిధ కేసులకు సంబంధించి జరుగుతున్న విచారణ గురించి అమిత్ షా కి లోకేష్ వివరించారు.73 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ని కేసుల పేరుతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అని అమిత్ షా అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉంది అని రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను గమనిస్తున్నాను అని లోకేష్ తో అమిత్ షా అన్నారు.