నాగార్జున సాగర్‌కు రికార్డు స్థాయిలో.. పోటెత్తిన వరద
నాగార్జున సాగర్‌కు ఎన్నడూ లేని విధంగా గంట గంటకు వరద పోటెత్తుతోంది. దీంతో సాగర్ గేట్లన్నీ ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే నాగార్జున సాగర్ గేట్లన్నీ కేవలం 10 గంటల వ్యవధిలో ఎత్తడం చరిత్రలో ఇదే తొలిసారి అని అధికారులు వెల్లడించారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూడటానికి నాగార్జున సాగర్‌కు పర్యాటకుల పెద్ద ఎత్తున రావడంతో రద్దీ పెరిగింది. వరద ఉధృత్తి తీవ్రంగా ఉన్నందున పర్యాటకులు ఎవ్వరిని కూడా అధికారులు డ్యామ్‌పైకి అనుమతించడం లేదు. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 580.90 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 304.986 అడుగులకు చేరింది.
ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల కారణంగా వస్తున్న వరద వల్ల ఉభయ తెలుగు రాష్ట్రాలలోని దాదాపు అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. మరోవైపు శ్రీశైలం,కడెం,ధవళేశ్వరం ప్రాజెక్టులకు కూడా భారీగా వరద చేరడంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి కూడా ఉగ్రరూపాన్ని తలపిస్తుంది. దీంతో అన్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంపు గ్రామాలకు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.