నిన్న పార్టా.. నేడు మోండల్ – ఇరకాటంలో తృణమూల్
నిన్న పార్ధా ఛటర్జీ.. ఇవాళ అనుబ్రతా మోండల్. సిబీఐ ఉచ్చులో ఒకరి వెంట ఒకరుగా చిక్కుకుంటూనే ఉన్నారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఉపాధ్యాయుల బదిలీల విషయంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన పార్ధా ఛటర్జీ .. పలు కేసుల్లో ఇరుక్కుని జైలు పాలయ్యాడు. ఇప్పుడు టీఎంసీకి చెందిన మరో నేత కూడా సీబీఐ కి టార్గెట్ అయ్యాడు. సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితునిగా పేరుపడ్డ అనుబ్రతా మోండల్ పశువుల అక్రమ రవాణా కేసులో పీకల లోతున ఇరుక్కుపోయాడు. ప్రస్తుతం ఈయన బీర్ భూమ్ జిల్లా తృణమూల్ పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. 2020లో జరిగిన ఈ కేసుకు సంబంధించి మోండల్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే అనేక పర్యాయాలు సమన్లు పంపినా మోండల్ సరిగ్గా స్పందిచ లేదని సీబీఐ పేర్కొంది. 2015 నుండి 2017 మధ్య కాలంలో దాదాపు 20 వేల పశువుల తలలను సరిహద్దు భద్రతా దళం స్వాధీనం చేసుకోవడంతో పశువుల అక్రమ రవాణా వ్యవహారం బట్టబయలైంది. మోండల్ తో పాటు ఆయన సెక్యూరిటీ సిబ్బంది సైగల్ హొస్సేన్‌ను కూడా సిబీఐ అరెస్ట్ చేసింది. ఈ వరుస సంఘటనలతో తృణమూల్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇదంతా రాజకీయ కక్షతో జరుగుతున్నదేనని ఆరోపణలు గుప్పిస్తోంది.