ముర్ము గెలుపు ఖాయం అంటూ..ఆ గ్రామంలో సంబరాలు
దేశంలో రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో దేశానికి పదిహేనవ రాష్ట్రపతిగా ఆ పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.అయితే ఇంకొన్ని గంటల్లోనే ఈ సందిగ్ధం వీడనుంది. ఈ క్రమంలో రాష్ట్రపతి ఎన్నికల బరిలో ద్రౌపది ముర్ము ,యశ్వంత్ సిన్హా ఉండగా విజయావకాశాలు ఎక్కువగా ముర్ముకే ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలకు ఎన్డీయే కూటమి సిద్దమవుతోంది. పలు రాష్ట్రాలలో విజయోత్సవాలకు బీజేపీ సన్నాహాలు చేస్తుంది. అదే విధంగా తీపి వంటకాలు,ప్రత్యేక నృత్యాలు వంటి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసింది. అయితే ముర్ము స్వగ్రామం ఒడిశా రాయ్‌రంగాపూర్‌లో మాత్రం పండగ వాతావరణం కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. ఆ గ్రామ ప్రజలు ఖచ్చితంగా ముర్ము విజయం సాధిస్తారని భావిస్తున్నారు.అందుకే ఆ ఊరి పెద్దలు 20 వేలకు పైగా ప్రత్యేక లడ్డూలను తయారు చేయించారు. అంతే కాకుండా కోయ డాన్సులు… బాణాసంచాలతో సంబరాలకు సర్వం సిద్దం చేశారు.ఈ సందర్భంగా ఆమె చదివిన పాఠశాలలో కోలాహాలం నెలకొంది. తమ పాఠశాలలో చదివిన ఆమెకు దేశానికి సేవ చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని… నాడు ద్రౌపది ముర్ముకు పాఠాలు నేర్పించినన బిశ్వేశ్వర్ మెహంతి తెలిపారు. తమ పాఠశాలలో చదివి రాష్ట్రపతి కాబోతున్నందుకు విద్యార్దులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ద్రౌపది ముర్ము విజయం సాధిస్తే..దేశానికి తొలి గిరిజన మహిళ రాష్ట్రపతిగా చరిత్ర సృష్టించనున్నారు.
Read more: పదవి విరమణ తర్వాత కూడా సకల సౌకర్యాలు