బిల్లు గడువు తీరిందా- కరెంటు గోవిందా
ఒక 4 ఏళ్ల క్రితం మనకు వచ్చిన కరంటు బిల్లుకు ఇప్పుడు వచ్చే బిల్లుకు తేడాలు గమనించారా . మన ఇంట్లో విద్యుత్ సామాగ్రి, గృహోపకరణాలలో మార్పు లేకపోయినా, కరెంట్ బిల్లుల్లో విపరీత మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా అతిగా పెరిగిన స్లాబ్ రేట్లు వినియోగదారుల నడ్డి విరుస్తున్నాయి. నెలకు 100 యూనిట్లు దాటితే రెట్టింపు వడ్డింపు. 200 యూనిట్లు దాటితే మూడింతల వడ్డింపుకి సిద్దమైపోవలసిందే. పైగా ఈ మధ్య విద్యుత్ బిల్లు చెల్లింపులో ఒక్క రోజు ఆలస్యమైనా విద్యుత్ కనెక్షన్‌ను కట్ చేస్తున్నారు. విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) మార్గదర్శకాలకు విరుద్ధంగా క్షేత్రస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా కరెంటు కనెక్షన్లను తొలగిస్తున్నారు. వ్యక్తిగత, ఉద్యోగ జీవితాల్లో పడి మరిచిపోవడం లేదా ఇంకా సమయముంది కదా.. తర్వాత చెల్లిద్దామనుకుని మరిచిపోవడం వంటి కారణాలతో చాలామంది వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించకలేకపోతున్నారు. ఇప్పుడే చెల్లిస్తాం కాసేపు ఆగమన్నాకూడా సిబ్బంది వినిపించుకోవడం లేదు.
ఈఆర్సీ నిబంధనల ప్రకారం 7రోజుల ముందుగా నోటీసు ఇచ్చి, తర్వాత కూడా చెల్లించలేకపోతేనే విద్యుత్ సరఫరాను ఆపివేయాల్సి ఉంటుంది. కానీ వీరు ఏ నోటీసు ఇవ్వకుండా కనెక్షన్లు తొలగిస్తున్నారు. డిస్కంలు ఈనిబంధనలు తుంగలో తొక్కి సాధారణ బిల్లులోనే బిల్ కమ్ నోటీస్ పేరుతో ప్రతినెలా బిల్లులోనే జారీ చేస్తున్నాయి. మామూలు వినియోగదారులకు ఈవిషయం అర్ధం కాదు. కనెక్షన్ ఒకసారి తొలగిస్తే తిరిగి బిల్లు బకాయిలతో పాటు రీకనెక్షన్ చార్జీలు కూడా చెల్లించవలసి వస్తోంది. పైగా బిల్లుకట్టిన వెంటనే సకాలంలో సరఫరా కావట్లేదు. ఐతే అధికారులు ఈవిషయం ఒప్పుకోవడం లేదు. తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం లేదని కొందరు సిబ్బందికి, వినియోగదారులకి జరిగే గొడవల వల్లే ఇలా ప్రవర్తిస్తున్నారని , వారిపై చర్యలు తీసుకుంటామని అంటున్నారు. నిజానికి డిస్కంల నష్టాల నుండి బయటపడే క్రమంలో 4నెలలుగా విద్యుత్ ఉద్యోగులకు జీతాలు ఆలస్యంగా చెల్లిస్తున్నారు. 100 శాతం బిల్లులు వసూలు చేయాలని యాజమాన్యాలు డీఈలకు లక్ష్యాలను నిర్దేశించడం వల్లే వారు క్రింది స్థాయి సిబ్బందికి మొత్తం బిల్లులు వసూలు చేస్తేనే జీతాలిస్తామంటూ లింకు పెట్టారు. దీనివల్ల ఒత్తిడికి గురై బిల్లు కట్టడం ఒకరోజు ఆలస్యమైనా వారు వెంటనే కనెక్షన్ తొలగిస్తున్నారు. ఇదికాక వాన పడితే పవర్ కట్, ఎండాకాలం పవర్ కట్ కూడా సాధారణమైపోయింది.