NewsTelangana

మునుగోడులో పనిచేస్తున్న ఆత్మగౌరవ నినాదం…

మునుగోడు ఉపఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్న తరుణంలో పరిణామాలు పూర్తి స్థాయిలో మారిపోతున్నాయ్. మునుగోడులో గెలిచి తీరాలని భావిస్తున్న బీజేపీ… అక్కడ ఉన్న మొత్తం పరిణామాలను ఆకలింపు చేసుకుంటోంది. స్థానికంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ బలంగా ఉన్నప్పటికీ… బీజేపీ ఇప్పటికే ప్రజల్లో మంచి అభిప్రాయాన్ని పొందింది. రాజగోపాల్ రెడ్డి.. తన కోసం రాజకీయాలు చేస్తున్నాడని కాంగ్రెస్, టీఆర్ఎస్‌లకు భిన్నంగా… నియోజకవర్గానికి మాత్రం ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్ ఒక్కొక్కటిగా వచ్చాయని… ఇదంతా రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోనే సాధ్యమైందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మునుగోడు ఓటర్లు. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి, రాజీనామా చేయకుంటే రోడ్లు వచ్చేవా, గిరిజిన బంధు ప్రకటన వచ్చేదా? పింఛన్లు మంజూరు చేసేవారా.. పథకాలు ఇచ్చేవారా అన్న చర్చ జనంలోకి పెద్ద ఎత్తున పోతోంది. అందుకే ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలని సామాన్యులు భావిస్తున్నారు. ప్రజలంటే ప్రభుత్వాలకు చులకన కారాదని… ఎన్నికలొస్తేనే వస్తామన్న భావనను అంతమొందించాలని భావిస్తున్నారు.

మునుగోడులో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని చాన్నాళ్లుగా కాంగ్రెస్ నాయకులు చెబుతూ వచ్చారు. కానీ మునుగోడులో బలమైన అభ్యర్థి సైతం ఎన్నికల్లో ఫలితాన్ని డిసైడ్ చేయగలడని రుజవవుతూనే ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఇక్కడ నుంచి 5 సార్లు విజయం సాధించినా.. ఆ తర్వాత ఆయన కుమార్తె ఇక్కడ అంతగా ప్రభావం చూపించలేకపోయారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఓటరు నాడి కూడా మారుతుంది. మునుగోడు ఓటరు ఇప్పుడు అభివృద్ధితోపాటు, ఆత్మగౌరవాన్ని కోరుకుంటున్నాడు. ఎనిమిదిన్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఏం జరిగిందన్న చర్చ కూడా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున విన్పిస్తోంది. న్యాయపరమైన డిమాండ్లను సైతం ఇన్నాళ్లూ పట్టించుకోకుండా టీఆర్ఎస్ నేతలు వ్యవహరించారని… ఇప్పుడు ఎన్నికలు రావడంతో ప్రేమ ఒలకబోస్తున్నారంటున్నారు. అందుకే హుజూరాబాద్‌ తీర్పును మునుగోడులో రిపీట్ చేస్తే కేసీఆర్ దిగొస్తాడని.. పేదలను పట్టించుకుంటారన్న అభిప్రాయం ఉంది. అందుకే హుజూరాబాద్ లెక్కన.. మునుగోడులో బీజేపీ జెండా ఎగురేస్తే ఆత్మగౌరం నిలబడుతుందని సామాన్యులు భావిస్తున్నారు.

వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. టీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి బలమైన పార్టీగా బీజేపీని భావించి రంగంలోకి దిగిన రాజగోపాల్ రెడ్డికి నియోజకవర్గంలో ఎన్నో సానుకూలతలు కన్పిస్తున్నాయ్. అటు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలకు భిన్నంగా ప్రజల్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వ పరంగా సమస్యలొచ్చినా.. తను స్వయంగా పేదలను ఆదుకుంటారన్న అభిప్రాయం సామాన్యుల్లో ఉంది. పార్టీ మార్పుపై మొదట్లో కొంత అసహనం వ్యక్తం చేసిన కొందరు ఓటర్లు.. టీఆర్ఎస్ పార్టీని ఓడించాలంటే అది కేవలం బీజేపీతోనే సాధ్యమని తేల్చి చెబుతున్నారు. అందుకే రాజగోపాల్ రెడ్డి తగినవాడని భావిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేరుగా.. మునుగోడులో ఎన్నికల ప్రచారం నిర్వహించడం.. బీజేపీ పెద్దలందరూ ఫోకస్ పెట్టడంతో ప్రజల్లో మంచి స్పందన వస్తోందని ఆ పార్టీ విశ్వాసంతో ఉంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వంతోపాటు, జాతీయ స్థాయి నేతలు సైతం మునుగోడులో ప్రచారం నిర్వహించి.. బీజేపీకి ఓట్లు ఎందుకు వేయాలన్నదానిపై ప్రజల్లో ఆలోచన తెస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇక టీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో ఓడిన కూసుకుంట్లకు టికెట్ ఖరారు చేయడంపై స్థానికంగా ఉన్న బీసీ నేతల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాజగోపాల్ రెడ్డిని ఓడించాలన్న ఆలోచనతో కూసుకుంట్లకు టికెట్ ఇచ్చారు సరే.. 80 శాతానికి పైగా ఉన్న బహుజనులను కాదని పార్టీ ఎలా నిర్ణయం తీసుకుంటుందని గులాబీ తమ్ముళ్లు గుసగుసలాడుతున్నారు. నియోజకవర్గంలో కూసుకుంట్ల వ్యవహారశైలిపైనా ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత కన్పిస్తోంది. రాష్ట్ర స్థాయిలోనూ టీఆర్ఎస్ పార్టీకి ప్రతికూల పవనాలు వీస్తున్న తరుణంలో.. మునుగోడులో ఆ పార్టీ ఎలా బయటపడాలన్నదానిపై మల్లగుల్లాలుపడుతోంది. అందుకే కీలక మంత్రులకు బాధ్యతలు అప్పగించిన కేసీఆర్ ఎంపీటీసీ యూనిట్ ఆధారంగా… 86 మంది బాధ్యులను రంగంలోకి దింపారు. హుజూరాబాద్‌లా అల్లరి కాకుండా పని కానిచ్చేయాలని నేతలును ఆదేశించారు. హుజూరాబాద్ విషయంలో జరిగిన పొరపాటు మరోసారి చేయొద్దని నేతలపై నిఘా ఉంచారు కేసీఆర్. కానీ స్థానికంగా ప్రజల నుంచి మద్దతు రాకపోవడంతో నేతలు లబోదిబోమంటున్నారు.