NewsNews AlertTelangana

కూసుకుంట్లకు టికెట్ ఇస్తే ఓడిస్తాం… మునుగోడు టీఆర్ఎస్‌ నేతల తిరుగుబావుటా

Share with

మునుగోడులో అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ పార్టీల్లో అగ్గిరాజుకుంటోంది. టికెట్ ఎవరికి ఇస్తారన్న పంచాయితీ నడము మాకంటే మాకేనంటూ నేతలు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో తనకు కాకుండా మరెవరికి టికెట్ ఇచ్చినా కష్టమేనంటూ పాల్వాయి స్రవంతి స్పష్టం చేస్తుంటే… టీఆర్ఎస్ పార్టీలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇస్తే సహకరించేది లేదంటూ ఆ పార్టీ నేతలు తేల్చి చెబుతున్నారు. కీలక సమయంలో టీఆర్ఎస్ పార్టీలో విభేదాలు స్పష్టమవుతుండటంతో హైకమాండ్ తలపట్టుకుంటోంది. 2018 ఎన్నికల్లో మునుగోడు నుంచి పోటీ చేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ మంత్రి జగదీష్ రెడ్డికి అసంతృప్తి నేతలు స్పష్టం చేశారు. దీంతో బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌‍కు ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్‌లను పిలిపించుకొని ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో కూసుకుంట్లకు టికెట్ కేటాయిస్తే పనిచేసేది లేదంటూ నేతలు తేల్చి చెప్పారు. కూసుకుంట్లకు టికెట్ ఇవ్వొద్దని ఇప్పటికే అసమ్మతి నేతలు సీఎం కేసీఆర్‌కు లేఖ సైతం రాశారు. దీంతో స్థానిక నేతలను మంత్రి జగదీష్ రెడ్డి బుజ్జగిస్తున్నారు. పార్టీ ఆదేశాలను ఎవరూ కూడా బేఖాతరు చేయొద్దని.. కేసీఆర్ సముచితమైన నిర్ణయం తీసుకుంటారని వారికి మంత్రి భరోసా ఇచ్చారు. ఐతే కూసుకుంట్ల విషయంలో తగ్గేదేలే అంటూ పార్టీకి వార్నింగ్ ఇస్తున్నారు.