ముంబై ఆర్థిక రాజధానే కాదు.. ఇకపై పొలిటికల్ క్యాపిటల్ కూడా!
2024 లోక్‌సభ ఎన్నికల కోసం తమ ప్రణాళికలపై చర్చించేందుకు 26 ఇండియా కూటమి పక్షాలు, రేపు ముంబైలో సమావేశం కానున్నాయి. శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) నాయకుడు సంజయ్ రౌత్ గత వారం మాట్లాడుతూ రెండు రోజుల సమావేశంలో కొత్త రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ఈశాన్య భారతదేశం నుండి పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. ఈ సమావేశంలో ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాల ఫార్ములా కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రతిపక్షం కూడా ఎన్నికలకు ముందు పరిష్కరించే అంశాలు, సమన్వయ కమిటీ ఆవశ్యకతపై చర్చించనున్నారు. ఇండియా కూటమి మొదటి సమావేశం జూన్‌లో పాట్నాలో జరిగింది. రెండోది జూలై మధ్యలో బెంగళూరులో జరిగింది. బెంగళూరు కాన్‌క్లేవ్ సందర్భంగా కూటమికి ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్, ఇండియాగా పేరును ఖరారు చేశారు.
ముంబై మీటింగ్‌లో కూటమి లోగోను ఆవిష్కరించనున్నారు. వ్యక్తిగత అజెండా అంటూ తనకు ఏమీ లేదని తేల్చిచెప్పారు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. ప్రతిపక్షాల ఐక్యత కోసం పనిచేస్తానన్నారు. ముంబై సమావేశంలో విపక్షాల సంకీర్ణమైన ఇండియా కూటమి కన్వీనర్ గా వేరెవరినైనా నియమించాలని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఇండియా కూటమి కన్వీనర్ గా నితీష్ కుమార్‌ను నియమించొచ్చన్న ప్రచారం నేపథ్యంలో ఆయన కన్వీనర్ పదవిపై క్లారిటీ ఇచ్చారు. ప్రతిపక్ష కూటమికి ఇదే చివరి సమావేశం కావాలని, తద్వారా పార్టీలు తమ తమ రాష్ట్రాల్లో పని ప్రారంభించాలని శివసేన నాయకులు కోరుకుంటున్నారు.

మరోవైపు బీజేపీ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాలపై సమీక్ష నిర్వహించడానికి 2 రోజుల సమావేశాన్ని కూడా ప్రకటించింది. మహారాష్ట్రలో 48 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. తొలుత ఆగస్టు 31న ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అధికారిక నివాసంలో విందుపై చర్చలు జరగనున్నాయి. సెప్టెంబరు 1న, మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన వ్యూహాలపై చర్చించేందుకు పలు సమావేశాలను నిర్వహించనుంది. ఈ సమావేశానికి షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్ అధ్యక్షత వహిస్తారు. మొత్తంగా ఇండియా కూటమి ఆర్థిక రాజధాని ముంబైలో పొలిటికల్ హీట్ పెంచేందుకు సిద్ధమవుతుంటే, అదే సమయంలో మహారాష్ట్రలో ఉన్న 48 లోక్ సభ స్థానాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై అటు శివసేన చీలిక వర్గం నేతలు, ఎన్సీపీ చీలిక నేతలతో బీజేపీ పెద్దలు చర్చించనున్నారు.

