NewsTelangana

కేసీఆర్ నిజ స్వరూపాన్ని మోదీకి చూపించారు

Share with

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను అడ్డుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేసిందో గడచిన రెండు రోజులుగా బయట ప్రపంచానికి స్పష్టంగా తెలిశాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ కార్యవర్గ సమావేశాల కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపైనా జరిమానాలు వేశారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చన్నారు. రాష్ట్రంలో దిగజారుడు రాజకీయాలను టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోందన్నారు. తెలంగాణాలో అభివృద్ధిని చూసి నేర్చుకోండి అంటూ టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని… కేసీఆర్ ప్రభుత్వ అవినీతిని నేర్చుకోవాలా? లేదంటే కుటుంబ పాలన నేర్చుకోవాలో చెప్పాలన్నారు. అసదుద్దీన్ ఒవైసీ డ్రైవింగ్ చేస్తుంటే .. టీఆర్ఎస్ పాలన నడుస్తోందని దుయ్యబట్టారు కిషన్ రెడ్డి. 8 ఏళ్లుగా సచివాలయానికి రాని ముఖ్యమంత్రి పాలన ఎలా చేయాలో నేర్పిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గడచిన 8 ఏళ్లుగా హోర్డింగ్‌లు, ప్రకటనలతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తీవ్రస్థాయిలో అక్రమాలకు పాల్పడిందని… డబ్బులు కుమ్మరించారని… ప్రతీ ఇంటికీ 10 వేల చొప్పున పంచినా… ప్రజల బీజేపీని గెలిపించారన్నారు. కుటుంబపాలన పోయి బీజేపీ అధికారంలోకి రావాలని తెలంగాణా ప్రజలు భావిస్తున్నారన్నారు కిషన్ రెడ్డి.

తెలంగాణా రాష్ట్రం కుటుంబ పాలనలో నడుస్తోందన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. కుటుంబమే కేబినెట్ గా మారి రాష్ట్రాన్ని దోచుకుంటోందన్నారు. ప్రజలకు సంబంధించిన ప్రతీ సమస్యపైనా బీజేపీ స్పందిస్తోందన్నారు. నీళ్లు, నిధులు, నియామకం అన్న నినాదాన్ని బీజేపీ పూర్తి చేస్తుందన్నారు సంజయ్. తెలంగాణాలో డబుల్ ఇంజన్ సర్కారును బీజేపీ ఏర్పాటు చేస్తుందన్నారు.