InternationalNews

శ్రీలంక బాటలో ఆర్థిక ఊబిలోకి మరో డజనుకు పైగా దేశాలు

Share with

శ్రీలంక దేశం ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలమవుతోంది. ప్రజల వద్ద డబ్బులు ఉన్నా నిత్యావసరాలు దొరకడం గగనమైపోతోంది. ఆహారం ఇంధనంతో సహా నిత్యావసరాల దిగుమతులకు అవసరమైన ఫారెక్స్ నిల్వలు లేకపోవడంతో…లంక సర్కారు చేతులెత్తేసింది. ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దడంలో పాలకులు చూపిన నిర్లక్ష్యమే ఆ దేశానికి శాపమని విమర్శలు వెల్లువెత్తున్నాయి. కరోనా కల్లోలంతోపాటు శ్రీలంక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అక్కడి ప్రజలను అంధకారంలోకి నెట్టేశాయి. ఆ దేశ స్వతంత్ర్య చరిత్రలోనే తొలిసారిగా తీవ్ర సంక్షోభంలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. నిత్యవసర వస్తువులు కొనుక్కోవడం కూడా కష్టంగా మారింది. గతంలో ఎన్నడూ లేనంతగా దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఆహారం చమురు విద్యుత్ సంక్షోభంతో శ్రీలంక కుదేలవుతోంది.

మితిమీరిన అప్పులతో శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పుడు అదే పరిస్థితినే మరో కొన్ని దేశాలు ఎదుర్కొంటున్నాయి. ఆ దేశాల ఆర్థిక వ్యవస్థ డేంజర్ జోన్‌లో ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న అప్పులు ద్రవ్యోల్బణంతో ఆ దేశాల ఎకనామీ పతనమయ్యే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంకతోపాటు లెబనాన్, సురినామ్, జాంబియా లాంటి దేశాలు ఇప్పటికే డిఫాల్ట్‌లోకి వెళ్లిపోయాయి. ఆ దేశాల బాటలోనే తాజాగా అర్జెంటీనా, ఉక్రెయిన్, ట్యూనీషియా, ఘన, ఈజిప్ట్, కెన్యా, ఇథియోపియా, ఎల్ సాల్వడార్, పాకిస్తాన్, బెలారస్, ఈక్వెడార్, నైజీరియా, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలు పయనిస్తున్నాయని వెల్లడించారు.