కాలిబూడిదైన ఇంటికి వెళ్లమంటారా – విక్రమ సింఘే
అందమైన ద్వీపదేశం శ్రీలంక ఎంతటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందో అందరికీ తెలిసిందే. రాజకీయంగానే కాక ఆర్థిక పరమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నూతన అధ్యక్షుడిపై నిరసనకారులు ఆయన అధ్యక్షపదవికి రాజీనామా చేసి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. వారికి సరైన సమాధానాన్ని ఇచ్చారు అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే. తనకు ఇల్లే లేదని ఎక్కడకు వెళ్లమంటారనీ ప్రశ్నించారు. తన ఇంటిని దహనం చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇల్లు లేని వ్యక్తిని ఇంటికి వెళ్లమనడంలో అర్ధం లేదన్నారు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని ఈ విపత్కర పరిస్థితుల నుండి బయటపడే మార్గం సమిష్టి కృషేన్నారు. దేశంలో ఆహార, ఇంధన కొరత కారణంగా IMFతో సంప్రదింపులు పూర్తిగా నిలిచిపోయాయన్నారు. ఒప్పందం కుదిరే వరకూ ఇతర దేశాలు సాయం చేయడానికి ముందుకురావన్నారు. కాబట్టి మనమే ఈ సంక్షోభం నుండి గట్టెక్కే మార్గాలు అన్వేషించాలన్నారు. ఐకమత్యంతో పనిచేయాలన్నారు. కొద్ది వారాల క్రితం అధ్యక్షుడిగా ఉన్న గొటబాయ రాజపక్సను గద్దె దించేందుకు జరిగిన నిరసనల కారణంగా ఆందోళనకారులు అప్పటి ప్రధానిగా ఉన్న విక్రమసింఘే ఇంటిని కూడా కాల్చివేసారు. తనకున్న ఒకే ఒక్క ఇంటిని కాల్చివేసారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.