NewsTelangana

మంత్రులు, ఎమ్మెల్యేలకు నెల జీతం కట్‌ చేయాలి

ఉప ఎన్నిక కోసం రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలంతా మునుగోడులో మకాం వేసి మరీ నెల రోజులుగా ప్రచారం చేస్తున్నారని.. వాళ్ల నియోజక వర్గంలోని ప్రజలకు చేయాల్సిన సేవను మరిచిపోయి ఒక పార్టీ కోసం పని చేస్తున్న ప్రజా ప్రతినిధులకు నెల రోజుల జీతం ఎందుకివ్వాలని సోషల్‌ డెమోక్రటిక్‌ ఫోరం అనే స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర కన్వీనర్‌, మాజీ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి ప్రశ్నించారు. 35 మంది అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులంతా మునుగోడులోనే తిష్ట వేశారని.. ఇదంతా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడమేనని మేధావులు, ప్రజా సంఘాలు సైతం ధ్వజమెత్తుతున్నాయి. ఒక్క అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఇలా రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులంతా మూకుమ్మడి దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ఎండగడుతున్నాయి.

అభ్యర్థుల రోజువారీ ఖర్చులను, డైలీ బులెటిన్‌ను విడుదల చేయాలని భారత ఎన్నికల సంఘాన్ని ఆకునూరి మురళి కోరారు. మునుగోడులో ఎన్నికల ప్రచార ప్రక్రియను సోషల్‌ డెమోక్రటిక్‌ ఫోరం సభ్యులు పరిశీలించారు. రాజకీయ పార్టీలు పరస్పర విమర్శలు, ఆరోపణలతో ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నాయని తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో డబ్బు, మద్యం విచ్ఛల విడిగా పంపిణీ అవుతోందని.. దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనని ఫోరం సభ్యులు స్పష్టం చేశారు.