NationalNews

అమ్మా.. నిన్ను మిస్సవుతున్నాం…

Share with

ఆమెకు పరిచయం అక్కర్లేదు.. బాల నటిగా వెండితెరపై అడుగు పెట్టి, స్టార్‌ హీరోయిన్‌గా దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమను ఏలిన నటి. అతిలోక సుందరి, అలనాటి అందాల తార శ్రీదేవి. నేడు 59వ జయంతి.  ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు ఆమెకు స్మరించుకుంటూ.. శ్రీదేవికి నివాళులు అర్పిస్తున్నారు. ఆమె జయంతి సందర్భంగా కుమార్తెలు జాన్వీ కపూర్‌, ఖుషీ కపూర్‌లు తల్లితో తమ అనుబంధాన్ని, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆమె లేని లోటు తీర్చలేనిదంటూ నివాళి అర్పించారు.

శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కపూర్‌ తల్లితో కలిసి తాను చిన్నప్పుడు దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. “‌హ్యాపీ బర్త్‌ డే అమ్మా. ప్రతిరోజూ నిన్ను మరింతగా మిస్సవుతూనే ఉన్నా. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా… ’’ అని కామెంట్‌ పెట్టారు. చిన్న కుమార్తె ఖుషీ కపూర్‌ కొన్నేళ్ళ కిందట తల్లితో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

2018 ఫిబ్రవరి 24న దుబాయ్‌లోని ఓ హోటల్‌లో ప్రమాదవశాత్తు శ్రీదేవి మరణించారు.  కుమార్తె జాన్వీని తన మాదిరి పెద్ద స్టార్‌ని చేయాలని శ్రీదేవి కలలు కన్నారు. జాన్విని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ నిర్మించిన `ధడక్‌` సినిమా రీలీజ్‌కు కొన్ని నెలల ముందే శ్రీదేవి కన్నుమూశారు. జాన్వీని కనీసం వెండితెరపై చూసుకునే అవకాశం కూడా శ్రీదేవికి దక్కలేదు.