NewsTelangana

వెంకట్‌రెడ్డి చూపు బీజేపీ వైపు?

Share with

కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణాలో రాజకీయ హీట్‌ పెంచేశారు. బీజేపీ తరఫున మునుగోడులో గెలిచి కాంగ్రెస్‌కు, టీఆర్‌ఎస్‌కు షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో కాంగ్రెస్‌ ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పరిస్థితి గందరగోళంగా మారింది. ఆయనను కాంగ్రెస్‌ వాళ్లు నమ్మడం లేదు. వెంకట్‌రెడ్డిని మునుగోడుకు దూరంగా ఉంచాలనుకుంటున్నారు. ఈ తరుణంలో వెంకట్‌రెడ్డి కూడా రాజీనామా గళం విప్పారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందంటే రాజీనామాకు సిద్ధమేనని ప్రకటించారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడులో అభివృద్ధి పనులను కేసీఆర్‌ ప్రభుత్వం ఆఘమేఘాలపై శ్రీకారం చుట్టిందన్నారు.

అయన మాటలను నిశితంగా పరిశీలిస్తే.. మునుగోడు నుంచి రాజగోపాల్‌రెడ్డి బీజేపీ తరఫున విజయం సాధిస్తే.. వెంకట్‌రెడ్డి కూడా ఎంపీ పదవికి రాజీనామా చేసి బీజేపీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధమవుతారా? అనే అనుమానాలను రేకెత్తిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పినా కాంగ్రెస్‌పై విమర్శల స్థాయిని వెంకట్‌రెడ్డి ఏమాత్రం తగ్గించలేదు. మరోవైపు సీఎం కేసీఆర్‌నూ తిడుతున్నారు. బీజేపీని మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు. దీన్ని బట్టి చూస్తే.. అన్నీ అనుకున్నట్లు జరిగితే మునుగోడు ఉప ఎన్నిక తర్వాత భువనగిరి పార్లమెంటు స్థానానికీ ఉప ఎన్నిక తప్పదేమో అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.