InternationalNews

నా కోసం అమ్మ, నాన్న చాలా త్యాగాలు చేశారు

తాను ఈ స్థాయిలో ఉన్నానంటే తన తల్లిదండ్రుల త్యాగ ఫలితమేనని టెక్‌ దిగ్గజం గూగుల్‌, ఆల్ఫాబెట్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ అన్నారు. తన ఎదుగుదలకు తల్లిదండ్రులు చాలా త్యాగాలు చేశారని.. వాళ్లు అందించిన స్ఫూర్తితో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోగలిగానని చెప్పారు. భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్‌ అవార్డును పిచాయ్‌కు అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జిత్‌ సింగ్‌ సంధు వాషింగ్టన్‌లో అందజేశారు. అవార్డు అందుకున్న తర్వాత పిచాయ్‌ భావోద్వేగానికి లోనయ్యారు. గూగుల్‌, భారత్‌ మధ్య గొప్ప భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.

భారత్‌ నాలో భాగం..

భారత్‌ తనలో భాగమని.. తాను ఎక్కిడికి వెళ్లినా ఆ వారసత్వాన్ని తీసుకెళ్తానని సుందర్‌ పిచాయ్‌ స్పష్టం చేశారు. అవార్డు ప్రకటించినందుకు భారత ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. తనను తీర్చి దిద్ది.. ఈ స్థాయికి చేరుకునేందుకు సహకరించిన దేశం నుంచి ఈ గౌరవం పొందడాన్ని గర్వంగా భావిస్తున్నానన్నారు. వాణిజ్యం-పరిశ్రమల విభాగంలో అత్యున్నత స్థానాన్ని అధిరోహించిన ప్రవాస భారతీయుడిగా సుందర్‌ పిచాయ్‌కు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును అందజేసింది. ఈ కార్యక్రమానికి శాన్‌ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ జనరల్‌ నాగేంద్ర ప్రసాద్‌, సుందర్‌ పిచాయ్‌ కుటుంబ సభ్యులు, బంధువులు, అతికొద్ది మంది ప్రతినిధులు హాజరయ్యారు.