మినీ రిజర్వాయర్‌గా మొగిలిగుండ్ల చెరువు : సీఎం జగన్
వెలిగొండ ప్రాజెక్ట్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రైతులకు ఎంతో మేలు చేకూరుస్తుందని అన్నారు ఏపీ సీఎం జగన్. వెలిగొండ మొదటి టన్నెల్ ఇప్పటికే పూర్తి అయ్యిందని అన్నారు. మొగిలిగుండ్ల చెరువును మినీ రిజర్వాయర్‌గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని సీఎం జగన్ చెప్పారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో నిర్వహించిన వై.ఎస్. రాజశేఖరరెడ్డి, దర్శి మాజీ శాసన సభ్యుడు బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

దివంగత నేతల విగ్రహాలను ఆవిష్కరించి.. మాట్లాడారు. పార్టీ నిర్దేశించి కార్యక్రమాలను తూచా తప్పక అమలు పరచాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ కేడర్ కు విజ్ఞప్తి చేశారు. రానున్న ఎన్నికల్లో 175 స్ధానాలను గెలిచి మన సత్తా ఏంటో చూపించాలని అన్నారు. అనంతరం ప్రకాశం జిల్లా పరిషత్ సభ్యులతో సీఎం సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి కార్యక్రమాలకు సొంత పార్టీకి చెందిన దర్శి శాసన సభ్యుడు మద్దిశెట్టి వేణుగోపాల్ డుమ్మా కొట్టాడు. దీంతో పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు తీవ్ర స్ధాయిలో ఉన్నట్లు భావిస్తున్నారు. ఒకవైపు సీఎం వస్తుంటే .. ఎమ్మెల్యే తన నియోజకవర్గం పరిధిలోని కురిచేడులో గడపగడపకూ కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. గత కొంతకాలంగా బూచేపల్లి శివప్రసాద్, మద్దిశెట్టి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ వ్యవహారం అనేకసార్లు సీఎం దృష్టికి వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. దీంతో పక్క నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమానికి పార్టీ అధినేత వచ్చినా మద్దిశెట్టి లైట్ తీసుకున్నారు.
