తొమ్మిదేళ్ల మోదీ పాలన గుర్తుగా కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం
భారత పార్లమెంటు కొత్త భవనాన్ని ఈ నెలాఖరులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా చివరి దశలో ఉన్న పార్లమెంట్ కొత్త భవనాన్ని మే చివరి వారంలో ప్రధాని ప్రారంభిస్తారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల క్రితం మే 26, 2014న ప్రమాణ స్వీకారం చేశారు. 970 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన నాలుగు అంతస్తుల భవనంలో 1,224 మంది ఎంపీలు ఉండవచ్చని అధికారులు తెలిపారు.

ఇది భారతదేశం ప్రజాస్వామ్య వారసత్వం, భోజన ప్రాంతాలు, విస్తారమైన పార్కింగ్ సౌకర్యాన్ని కలిగి ఉంది. మొత్తంగా భారత ప్రజాస్వామ్య సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్మాణం జరిపారు. ఉభయ సభల్లోని సిబ్బంది కొత్త యూనిఫామ్‌తో కన్పిస్తారు. వీటిని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT) రూపొందించింది. కొత్త పార్లమెంట్ భవనానికి మూడు ద్వారాలున్నాయి. జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్, కర్మ ద్వార్ అని పిలుస్తారు. ఎంపీలు, వీఐపీలు, సందర్శకుల కోసం ప్రత్యేక ప్రవేశ మార్గాలను ఏర్పాటు చేశారు. కొత్త పార్లమెంట్ భవనానికి 2020 డిసెంబర్‌లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.

నరేంద్ర మోడీ నేతృత్వంలోని తొమ్మిదేళ్ల ప్రభుత్వానికి గుర్తుగా, బీజేపీ దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ నియోజకవర్గాలను కవర్ చేస్తూ నెల రోజుల పాటు భారీ “స్పెషల్ కాంటాక్ట్ క్యాంపెయిన్” ప్లాన్ చేసింది. మే 30న భారీ ర్యాలీతో ప్రధాని మోదీ ప్రచారాన్ని ప్రారంభిస్తారని, మరుసటి రోజు మే 31న ప్రధాని రెండో ర్యాలీ నిర్వహించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా బీజేపీ సీనియర్ నేతల 51 ర్యాలీలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. 396 లోక్‌సభ స్థానాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలు, బహిరంగ సభలకు బీజేపీ ముఖ్యమంత్రులు, రాష్ట్రాల ప్రతిపక్ష నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానిస్తారు.

