ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలో ఈనెలాఖరకు ఖాళీ అవుతున్న ఏడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎన్నికకు సంబంధించి రాష్ట్ర శాసనమండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. శాసనమండలి సభ్యులు చల్లా భగీరథ రెడ్డి పదవీకాలం గత నవంబర్ రెండో తేదీన పూర్తి కాగా ప్రస్తుత వైఎస్ఆర్సిపీ సభ్యులు పెనుమత్స వరాహ వెంకట సూర్యనారాయణ రాజు, డొక్కా మాణిక్య వరప్రసాదరావు, పోతుల సునీత, గంగుల ప్రభాకర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ సభ్యులు నారా లోకేశ్, బచ్చుల అర్జునుడుల పదవీ కాలం ఈనెల 29 తో ముగియనుంది. కాగా చల్లా భగీరథ రెడ్డి గతేడాది మరణించారు. బచ్చుల అర్జునుడు ఇటీవల మృతి చెందారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖాళీల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం గత నెల 27వ తేదీన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగా సోమవారం ఇందుకు సంబంధించిన ఎన్నికల ప్రకటనను ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి జారీ చేశారు.

ఇందుకు సంబంధించి రాష్ట్ర శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి ఫారం ఒకటి ద్వారా సోమవారం ఎన్నికల ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయబోయే అభ్యర్థులు స్వయంగా గానీ, లేదా వారి ప్రతిపాదకుడు గానీ, శాసనసభ భవనంలో రిటర్నింగ్ అధికారైన తన వద్ద గాని లేదా సహాయ రిటర్నింగ్ అధికారి శాసనమండలి ఉప కార్యదర్శికి గానీ నామినేషన్లు సమర్పించవచ్చని తెలిపారు. అయితే శాసనమండలిలో ఈ నెల ఆఖరికి ఖాళీ అవుతున్న ఏడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికలకు సంబంధించి ఈ స్థానాలన్నీ వైయస్సార్సీపీ ఖాతాలోనే జమ కానున్నాయి.

ఈనెల ఆరో తేదీ నుండి పదో తేదీ వరకు సెలవు దినాలు మినహా మిగతా పని దినాల్లో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ ఉంటే… ఈనెల 23వ తేదీ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు అసెంబ్లీ భవనంలో పోలింగ్ జరుగుతుందని ఆయన తెలిపారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే అదేరోజు సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు.