మేడిగడ్డ.. ప్రారంభం నుండే లీక్: ఈటల రాజేందర్
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అతి కీలకమైన మేడిగడ్డ రిజర్వాయర్ (లక్ష్మీ) బ్యారేజ్ వంతెన కుంగిపోవడం ఆందోళనకరమని బీజేపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. పేరు తమకే రావాలనే సంకుచిత లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారన్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈయన మాట్లాడారు. ఆదివారం మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించి వచ్చాం. గతంలో విశ్వేశ్వరరెడ్డి పలుమార్లు సందేహాలు లేవనెత్తారు. కాళేశ్వరంపై కేసీఆర్ మాట్లాడిన సమయంలో దాని నిర్మాణ తీరుపై నిపుణులు హెచ్చరించారు. అలోకేషన్ పద్ధతిలో కావాలనే ప్రాజెక్టులు కొందరికి అప్పజెప్పారు. ఎలాంటి సాంకేతికత వాడకపోయినా ఇప్పటికీ నాగార్జునసాగర్ డ్యామ్ చెక్కు చెదరకుండా ఉంది. కాళేశ్వరంలోని మూడు ప్రాజెక్టులను అతి తక్కువ కాలంలో కట్టి జాతికి అంకితం చేశారు. ప్రాజెక్టు సైట్ ఎంపికలోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. మేడిగడ్డ బ్యారేజీ కట్టినప్పటి నుంచి లీక్ అవుతోంది. ఇసుక మీదే ప్రాజెక్టు కట్టారు. కన్నెపల్లి పంప్‌హౌస్ మొత్తం కూలిపోయింది. అప్పుడు నిపుణులను పంప్‌హౌస్ పరిసరాల్లోకి రాకుండా 144 సెక్షన్ విధించారు. నిజాలను దాచే ప్రయత్నం చేశారు. ప్రభుత్వతప్పిదం వల్ల రూ.వేల కోట్ల నష్టపోయింది. ఇవాళ ప్రాజెక్టు పరిస్థితి నిర్మాణ లోపాలకు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రాజెక్టులు కేవలం టూరిస్ట్ స్పాట్లుగా మిగులుతున్నాయి. ప్రజల డబ్బుతో కట్టిన ప్రాజెక్టుల విషయంలో వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ వైఫల్యానికి సీఎం కేసీఆరే కారణం. ఈ ఘటనకు బాధ్యత వహించి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఈ ఘటనపై నిపుణులు కమిటీ వేసి ఒక శ్వేత పత్రం విడుదల చేయాలి అని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

