అమ్మాయి రెండవ కాన్పులో పుట్టినా కూడా మాతృవందన యోజన వర్తింపు
దేశంలో ఆడపిల్లల జనన రేటును ప్రోత్సహించేందుకు కేంద్రప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు ఇస్తోంది. వీటిలో ప్రధానమంత్రి మాతృవందన యోజన(PMMVY) కూడా ఒకటి. ఈ పథకం ప్రకారం రెండవసారి గర్భం దాల్చినప్పుడు ఆడపిల్ల పుట్టినా కూడా వారికి 6 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఇప్పటివరకూ తొలికాన్పులో మాత్రమే ఏ బిడ్డ పుట్టినా 5 వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో సహాయం చేస్తున్నారు. గర్భం దాల్చిన వెంటనే 1000 రూపాయలు, ఆరునెలల అనంతరం 2 వేలు. ప్రసవానంతరం 14 వారాల ఇమ్యూనైజేషన్ పూర్తయ్యాక 2వేల రూపాయలను చెల్లిస్తున్నారు.

అయితే ఇప్పుడు కొత్త సవరణ ప్రకారం రెండవ కాన్పుకు కూడా ఆడపిల్ల పుట్టినప్పుడు మాత్రమే ఈ పథకం వర్తింపచేస్తున్నారు. రెండవసారి కవల పిల్లలు పుట్టినా, వారిలో ఒక ఆడపిల్ల ఉన్నా కూడా ఈ పథకం వర్తిస్తుంది. మొదటి సారి కూడా ఆర్థిక సహాయంలో మార్పులు చేస్తున్నారు. ఆడపిల్ల లేదా మగపిల్లవాడు ఎవరు పుట్టినా తొలికాన్పుకు ఈ పథకం వర్తిస్తుంది. గర్భం ధరించినప్పుడు 3వేల రూపాయలు. ప్రసవానంతరం ఇమ్యూనైజేషన్ ప్రక్రియ అనంతరం 14 వారాలకు 2 వేల రూపాయలు చెల్లిస్తారు. ఈ పథకం కింద కేంద్రప్రభుత్వ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవలసి ఉంటుంది. కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు ఈ వ్యయాన్ని 60:40 నిష్పత్తిలో భరిస్తాయి.

