ఉక్రెయిన్‌లో భారీ డ్యామ్ పేల్చివేత.. నిరాశ్రయులైన వేల మంది ప్రజలు
ఈరోజు ఉక్రెయిన్‌కు తీరని నష్టం జరిగింది. వేల మంది ప్రజలు ఇళ్లు వదిలి నిరాశ్రయులయ్యారు. సురక్షిత ప్రాంతాలకు పరుగుల తీసారు. ఉక్రెయిన్‌లోని నీపర్ నదిపై ఉన్న భారీ నోవా కఖోవ్కా డ్యామ్‌ను పేల్చి వేశారు. దీనితో కట్టలు తెగిన నీరు వరదలా లోతట్టు ప్రాంతాల గ్రామాలపై విరుచుకు పడింది. దక్షిణ ఉక్రెయిన్‌లోని ఖెర్సాన్‌కు 30 కిలోమీటర్ల దూరంలోని ఈ డ్యామ్‌పై గత కొన్ని నెలలుగా భారీగా దాడులు జరుగుతున్నాయి. ఉక్రెయిన్ మిలటరీ కమాండర్ రష్యా భద్రతా దళాలే ఈ డ్యామ్‌ను పేల్చి వేశారని పేర్కొన్నారు. అయితే ఉక్రెయిన్‌లోని రష్యా అధికారులు మాత్రం ఇది ఉగ్రదాడులుగా అభివర్ణిస్తున్నారు. స్థానిక రష్యా మేయర్ వ్లాదిమిర్ వాదన ప్రకారం అర్థరాత్రి నుండి కఖోవ్కా డ్యామ్‌పై దాడులు జరుగుతున్నాయని, ఈ కారణంగానే గేటు వాల్వులు దెబ్బతిన్నాయని, కొద్ది సేపటిలోనే నీరు భారీ స్థాయిలో లోతట్టు ప్రాంతాలకు చేరుకుంది.

నీపర్ నదికి దగ్గరలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే ఖాళీ చేయాలంటూ ఉక్రెయిన్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఓల్హిక, లివే, మైఖోలావిక, ఇవానివ్కా వంటి పలు గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు. ఈ డ్యామ్ విధ్వంసంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అత్యవసర భేటీ నిర్వహించనున్నారు. దీనిలో నేషనల్ సెక్యూరిటీ, డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు పాల్గొననున్నారు. ఈ డ్యామ్‌లో 18 క్యూబిక్ కిలోమీటర్ల నీరు నిల్వ ఉంచవచ్చు. గత ఏడాది అక్టోబర్ నుండి ఈ డ్యామ్‌ను పేల్చి వేస్తారనే భయాలు వెంటాడుతున్నాయి. ఉక్రెయిన్‌కు భారీ జలవిద్యుత్‌ను అందజేసే ఈ డ్యామ్ పేల్చివేత వల్ల ఆ దేశాన్ని కరెంటు కష్టాలు చుట్టుముట్టాయి.

