గుహ నుండి బ్రతికి బయటపడిన కామారెడ్డి యువకుడు
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట అనే గ్రామానికి చెందిన ఓ యువకుడు సరదాగా వేటకు వెళ్లి పెద్ద ప్రమాదంలో పడ్డాడు. వివరాలలోకి వెళితే షాడ రాజు అనే వ్యక్తి మంగళవారం స్నేహితుడితో వేటకు వెళ్లి వస్తుండగా రాళ్లపై నుండి వెళ్తుండగా సెల్‌ఫోన్ రాళ్ల మధ్య పడిపోయింది. దానిని తీసే ప్రయత్నంలో రాళ్ల మధ్య ఉన్న గుహలో జారి పడిపోయాడు. పాపం తలకిందులుగానే వ్రేలాడుతూ ఇరుక్కుపోయాడు.అతనిని రక్షించేటందుకు బుధవారం నుండి సహాయక చర్యలు చేపట్టారు. ఈరోజు ఉదయం రెండు జేసీబీలు, ఇతర యంత్రాల సహాయంతో బండరాళ్లను తొలగిస్తున్నారు. దాదాపు 40 గంటలుగా తలకిందులుగా ఉండి యాతన అనుభవించాడు. ఒక కాలు, ఒక చేయి మాత్రమే బయటకు కనిపించాయి. అతడికి నీళ్లు తాగిస్తూ ధైర్యం చెపుతూ అతనిని రక్షించేటందుకు పోలీస్, రెవెన్యూ, అటవీశాఖల అధికారులు తీవ్రంగా కృషి చేశారు. చివరకు వారి కృషి ఫలించింది. జేసీబీల సహాయంతో బండరాళ్లను తొలగించి, ఎట్టకేలకు రాజును బయటకు తీసుకొని రాగలిగారు. అతని శరీరంపై బాగా గాయాలు కావడంతో అంబులెన్సులో హాస్పటల్‌కు పంపించారు. అతని కుటుంబసభ్యులు, బంధువులు అధికారులకు సంతోషంతో కృతజ్ఞతలు తెలియజేశారు.

