News

మహారాష్ట్రలో మహాభారతం… ఉద్ధవ్ స్వయంకృతం

Share with

అసలు ఎవరీ ఎక్‌నాథ్ షిండే ? శివ సేన ఎమ్మెల్యేలు ఆయన వెంట నిలబడటానికి కారణం ఏమిటి ? ఉద్ధవ్ థాక్రే చేసిన తప్పులేంటి ? ఇక బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందా?
రాజ్యాంగ సంక్షోభం ఏర్పడకుందా గవర్నర్ ముందు ఉన్న మార్గాలు ఏంటి?

ఎవరీ ఎక్‌నాథ్ షిండే?

మహారాష్ట్రలో శివసేన ఏర్పడటానికి ప్రధాన లక్ష్యం మహారాష్ట్ర మహారాష్ట్రీయులకే అనే ప్రధాన ఎజెండాతో ఆ పార్టీ ఏర్పాటయ్యింది. బాలథాక్రే కాలం నుంచి అధికారం కోసం ఏనాడు శివసేన పాకులాడలేదు. తర్వాత హిందుత్వ అజెండాతో ప్రధానంగా బరిలో నిలబడిన పార్టీగా జనంలో ఆదరణ పొందింది. బాలథాక్రే కాలం నుంచి సాధారణ నాయకుడి గానే షిండే ఉన్నారు. అసలు షిండే ఇంతవరకు కూడా బలమైన నాయకుడూ కాదు. బలమైన వర్గం ఉన్న నాయకుడు కాదు …అతిసామాన్యుడు. శివసేనలో ముందు నుంచి సౌమ్యుడిగా.. మితవాద నాయకుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి… మరి ఇంతగా తిరుగుబాటు చేయడానికి ప్రధాన కారణం ఈయన ఒక్కడే కాదు. మొత్తం శివసేన ఎమ్మెల్యేలు సంఘటితంగా తిరుగుబాటు చేయడం వెనుక పెద్ద స్టోరీయే ఉంది. షిండే సామూహిక తిరుగుబాటుకు నాయకుడు మాత్రమే. వీరిలో అసంతృప్తి లావాలా పెల్లుబీకడానికి అనేక కారణాలున్నాయ్.

నామమాత్రంగా శివసేన అధికారంలో ఉన్న అధికారం మొత్తం ఎన్సీపీ, కాంగ్రెస్ నాయకుల చేతిలో ఉండటమే. ఉద్ధవ్ థాక్రే ఏడాది నుంచి సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అందుబాటులో లేకపోవడం. కొడుకు ఆదిత్య నాథ్ థాక్రే ప్రభుత్వంలోనూ, పార్టీలో జోక్యం చేసుకోవడం… స్థానిక నాయకత్వాన్ని బలహీన పర్చడంతో ఎమ్మెల్యేలు రగిలిపోయారు. మరో ప్రధాన కారణం శివసేన ప్రధాన ఓటు బ్యాంకు హిందుత్వవాదం. కానీ హిందుత్వ వాదం మీద సర్కార్ ఉదాసీనత శివసైనికులకు ఆగ్రహం తెప్పించింది. వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు సన్నగిల్లాయి. ఇక కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు ప్రభుత్వంలో ఉన్న వారిలో సగం మంది మీద వివిధ అవినీతి కేసుల్లో చిక్కుకున్నారు. సాక్షాత్తు రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్, మైనారిటీ శాఖ మంత్రి నవాబ్ మాలిక్ అవినీతి కేసుల్లో చిక్కుకొని జైలులో ఉన్నారు. ఓవైపు అవినీతి… మరోవైపు హిందుత్వంపై ఉదాసీనత… వెరసి వచ్చే ఎన్నికల్లో శివసేన అభ్యర్థులు గెలిచే అవకాశమే లేకుండా చేస్తున్నాయ్. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒక్క శివ సేన ఎమ్మెల్యే మీద కూడా అవినీతి మరక లేదు. షిండే గత ప్రభుత్వం… బీజేపీ,శివసేనలో బాంబే కారిడార్ సుమారు 12 వేల కోట్ల ప్రాజెక్టు సమర్థవంతంగా పూర్తి చేసి థానే ప్రాంతంలో బీజేపీ కన్నా శివసేన బలంగా ఉండడానికి కారణమయ్యాడు. 2019 ఎన్నికల్లో బీజేపీ శివసేన సీట్ల సర్దుబాటులో షిండే పేరు బీజేపీ అభ్యర్థుల జాబితాలో కన్పించినా… ఆ తర్వాత శివసేన అభ్యర్థిగా రంగంలో నిలిచారు.

ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి చూస్తే 2019లో శివసేన +బీజేపీ కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళ్తే కూటమికి రాష్ట్ర ప్రజలు స్పష్టమైన ఆధిక్యత ఇచ్చారు. బీజేపీకి 105 సీట్లు శివసేనకు 55 సీట్లు, కాంగ్రెస్ 44, ఎన్సీపీకి 53, ఇతరులు 29 చోట్లా గెలిచారు. రాజ్యాంగ సంప్రదాయం ప్రకారం ఎన్నికలకు ముందు ఏర్పడిన కూటమికే అధికారంలో ఉండే నైతిక అధికారం ఉంటుంది. కానీ ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఎవరినైతే ప్రజలు తిరస్కరించారో వారు అంకెల గారిడితో ప్రజా తీర్పునకు వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నేడు రాజ్యాంగ విలువలు గురుంచి మాట్లాడుతున్న కాంగ్రెస్… 1967 నుంచి తనకు వ్యతిరేకంగా ఉన్నపార్టీలను
సుమారు 100కి పైగానే బలమైన… తగిన మెజారిటీ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసి అప్రదిష్టమూటగట్టుకొంది. మచ్చుతునకగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఉదాంతాన్ని తీసుకోవచ్చు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 91 మంది ఎమ్మెల్యేలను నాదెండ్ల భాస్కరరావు నాయకత్వంలో చిలిపోయారు. కానీ రామారావు అసెంబ్లీని సమావేశపరిస్తే మెజారిటీ నిరూపించుకుంటానని చెప్పి గవర్నర్ ముందు 161 మంది ఎమ్మెల్యేలను హాజరు పరిచిన ఆనాటి గవర్నర్ రాం లాల్ నిర్ధక్ష్యంగా ప్రభుత్వాన్ని రద్దు చేశారు. 1997లో ఇలానే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని, 1996 లో గుజరాత్ లోని బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేసిన ఘటనలు చూశాం. ఇలాంటి నిరంకుశ సంఘటనలు కాంగ్రెస్ హయాంలో కోకొల్లలు.. కానీ తానేం పాపం ఎరుగనని కాంగ్రెస్ నేడు మొసలి కన్నీళ్లు కారుస్తోంది. కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యం సాగే రోజుల్లో పార్టీ ఫిరాయింపులు అన్నీ ఇన్నీ కావు. ప్రజాస్వామ్య ముసుగు ఛిద్రం కావడంతో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని 1985లో 10 వ షెడ్యూల్లో తీసుకొని వచ్చారు హస్తం పార్టీ నేతలు. కానీ ఫిరాయింపుల్లో లొసుగులతో ఆ వ్యవస్థ నేటికీ కూనరిల్లుతోంది.

ఉద్ధవ్ థాక్రే గవర్నర్‌కి రాజీనామా సమర్పిస్తారా? లేకపోతే మెజారిటీ నిరూపించుకోవడానికి అసెంబ్లీని సమావేశ పరచమంటారా? ప్రభుత్వాన్ని రద్దు చేయమని కోరతారా అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా నిలుస్తోంది.

1 ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేస్తే సమస్య ఏమీ ఉండదు… ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని గవర్నర్ ఆహ్వానిస్తారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడొచ్చు.

  1. మెజారిటీ నిరూపించకుంటాను అవకాశం ఇవ్వండని చెబితే పార్టీ విప్ జారీ చేస్తుంది… కాబట్టి తిరుగుబాటు MLA లు అందరి మీద అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. సభ్యులు సమావేశానికి హాజరుకాకాపోయిన అనర్హతకు బాధితులు అవుతారు. ఇక్కడ గవర్నర్ నిర్ణయం కీలకమవుతుంది. మరో విషయం కూడా జ్ఞప్తికి తెచ్చుకోవాలి. టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ పార్టీని చీల్చి… ఆనాడు చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఆ ఫార్ములా గవర్నర్ పాటిస్తే ఈ గండం నుంచి తిరుగుబాటు ఎమ్మెల్యేలు బయపడొచ్చు.
  2. గవర్నర్ మెజారిటీ సంఖ్య బలం గల పార్టీని ఆహ్వానిస్తే… బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అప్పుడు స్పీకర్ తిరుగుబాటు ఎమ్మెల్యేల కూటమిని… అసలైన శివసేనగా గుర్తిస్తే తిరుబాటు ఎమ్మెల్యేలకు ఢోకా ఉండదు. పార్టీ ఫిరాయింపుల ఖడ్గం నుంచి రక్షణ లభిస్తుంది.
  3. ఏది ఏమైనా పోలైన ఓట్లలో 50 శాతం కన్న తక్కువ ఓట్లు సాధించిన పార్టీలు పాలకులైతే… అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? రాజకీయ కారణాలు ఎలా ఉన్నా దేశంలో రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని ప్రజాస్వామ్య వాదిగా కోరుకుంటున్నా…

డాక్టర్ జి. అజ్మతుల్లా ఖాన్
రాజకీయ విశ్లేషకులు