NationalNews

అహంకారం, అధికారం తలకెక్కితే అది ఉద్ధవ్ థాక్రే…

Share with

ఉద్ధవ్ థాక్రే మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వరు… ఎమ్మెల్యేలకు టచ్‌లో ఉండరు… పార్టీ ముఖ్యులకు ఆయన కన్పించరు. చుట్టూ ఉన్న నలుగురు కోటరీ నేతలకు తప్పించి… ఉద్ధవ్ ఎవరికీ కన్పించడు. విన్పించడు… పులి కడుపున పులే పుడుతుందని సగర్వంగా ఆయన తన గురించి గొప్పలు చెప్పుకోవచ్చు. మరి ఆ పులి లక్షణాలు కూడా పుణికిపుచ్చుకోవాలి కదా… బాల్ థాక్రే కడుపున పుట్టిన ఉద్ధవ్… పులి లాంటి పార్టీని పిల్లిలా మార్చేశాడన్న విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయ్. థాక్రే స్థాపించిన శివసేన పార్టీని మరొకరి చేతుల్లోకి పోయేలా చేశారంటే అసలు బ్యాగ్రౌండ్ ఏం జరిగిందో ఊహించొచ్చు. ఇప్పుడు మహారాష్ట్రలో జరుగుతున్న మహాభారత సంగ్రామం అంతా ఉద్ధవ్ థాక్రే స్వయంకృతమంటున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆయనకు తగిన శాస్తి చేస్తున్నారంటున్నారు ఎక్స్‌పర్ట్స్.

శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే గురించి ఇప్పుడిప్పుడే అనేక వార్తలు వెలుగులోకి వస్తున్నాయ్. హిందుత్వాన్ని ఊపిరిగా పోసుకున్న పార్టీని ఒక సాధారణ మంత్రి, సొంత పార్టీ నేతతో చిత్తు చేయడం మాత్రం అసాధారణ విషయమే. వాస్తవానికి ఉద్ధవ్ థాక్రే అధికారాన్ని నేరుగా అనుభవిస్తోంది రెండున్నరేళ్ల నుంచే. అంతకు ముందు ఆయన తొలుబొమ్మ పాలకులతో అధికారాన్ని ఏంచక్కా ఎంజాయ్ చేశారు. శివసేన అసలు రంగును ఆ పార్టీ రెబల్ నేత ఎక్‌నాథ్ షిండే బహిర్గతం చేసే వరకు.. అధినాయకుడి గురించి ప్రజలకు తెలిసింది తక్కువ. అంతలా ఇబ్బంది ఉన్నా… సంకీర్ణ ధర్మమూ, హిందుత్వం గురించి ఎక్ నాథ్ మాట్లాడారు కానీ.. ఉద్ధవ్ ఫంక్షనింగ్ గురించి అసలు మాట్లాడలేదు. బయటకు కాంగ్రెస్, ఎన్సీపీతో.. శివసేన కటీఫ్ చెప్పాలన్న డిమాండ్ పెట్టినప్పటికీ లోపల మాత్రం ఉద్ధవ్ థాక్రే ఒంటెద్దు పోకడలే తాజా పరిస్థితి కారణమని మాత్రం చెబుతున్నారు.

రాజకీయ నాయకుడిని ప్రజలు గుడ్డిగా ఇష్టపడతారు. చెప్పినవి చేయకున్నా మన్నిస్తారు. అహాన్ని దెబ్బతీస్తే మాత్రం ఊరుకోరు. అందుకు రాజకీయ నేతలైనా, పార్టీల అధినేతలైనా అతీతులేం కాదు… తెలుగునాట కూడా ఇప్పుడు ప్రాంతీయ పార్టీల హవా నడుస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ వరుసగా రెండు సార్లు అధికారాన్ని దక్కించుకుంటే… ఏపీలో మాత్రం మొదటి టర్మ్ టీడీపీ గెలిస్తే… రెండో టర్మ్ వైసీపీ అధికారంలోకి వచ్చింది. అటు ఏపీ, ఇటు తెలంగాణలోనూ ముందస్తు ఎన్నికలు రావొచ్చన్న సంకేతాలొస్తున్న తరుణంలో ఇక్కడ నాయకుల గురించి సైతం పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయ్. ఈ తరుణంలో మహారాష్ట్రలో శివసేన లాంటి పార్టీని అక్కడ ఒక సాధారణ మంత్రి ఢీకొట్టాడంటే… ఇక్కడ మహా చైతన్యవంతమైన నాయకులు, ప్రజలు ఎలా స్పందిస్తారో ఇట్టే ఊహించవచ్చు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు.. పాలకులు కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే నాయకులకు మాంచిది…