బీజేపీకి బైబై.. సీఎం పదవికి నితీష్ రాజీనామా
బంధం బెడిసి కొట్టింది. అన్యోన్యత సన్నగిల్లింది. దూరం పెరిగి పోయింది. కొన్నేళ్ళుగా సాగిన వారి స్నేహం మసిబారి పోయింది. ఎన్.డీ.ఏ నుండి జేడియూ బయటకొచ్చింది. ఇప్పుడంతా ఎడమెగం.. పెడమొగం. కొన్ని రోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ.. బీజేపీతో బంధాన్ని తెంచేసుకుంది. ఎవరికి వారికే పట్టుదలలు.. పంతాలు. కలిసి సర్కార్ ను నడుపుతున్నా ఆధిపత్యం కోసం ఆరాటాలు. మాట చెల్లడం లేదన్న భావన ఒకరిలో. మెజారిటీ బలం మాదే కనుక ఏదైనా చెల్లుబాటు అవుతుందన్న ధోరణి మరొకరిలో. ఈ పరిణామాలన్నీ నితీష్ సర్కార్ కిందకు నీళ్ళు తెచ్చాయి. రాజకీయ భవితవ్యాన్ని అడ్డుకునేందుకు బీజేపీ కుయుక్తులు పన్నుతోందని భావించిన నితీష్ ఆ పార్టీకి కటీఫ్ చెప్పేశారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన నితీష్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక ఎన్.డీఏతో కొనసాగేది లేదని తేల్చేశారు. దీంతో బీహార్ రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఇప్పుడక్కడ అసలేం జరగబోతోంది? ఎవరి ఎత్తులు ఎలా ఉండబోతున్నాయి ? ఎవరి భవిష్యత్ కార్యాచరణ ఏమిటీ అన్నది ఆసక్తిగా మారింది.
మొదట్లో కనిపించినంత ధీమా ఇప్పుడు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో తక్కువ సీట్లు సాధించినా, బీజేపీ బలంతో సునాయాసంగా సర్కార్ ఏర్పాటు చేసిన నితీష్ లో ఇప్పుడు తెలియని భయం చోటు చేసుకుంది. బీజేపీ వ్యూహాలు, ఎత్తుగడలు జేడియులో ఆందోళన రేపాయి. పార్టీని చీల్చే కుట్రలు కూడా జరుగుతున్నాయన్న భయం జేడీయులో స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని నెలలుగా కొనసాగుతున్న సంక్షోభ పరిస్ధితులు జేడీయూని పునరాలోచనలో పడేశాయి. ఇక ఉపేక్షిస్తే ముప్పు తప్పదని భావించిన నితీష్ .. ఎన్డీఏకి బైబై చెప్పి బయటకు వచ్చేశారు. దీనికి తోడు నిన్న మొన్నటి వరకు రాజ్యసభ సభ్యునిగా ఉండి, మోడీ సర్కార్ లో కీలక మంత్రిగా వ్యవహరించిన ఆర్పీ సింగ్ ఇటీవల ఆర్జేడీకి రాజీనామా చేయడం తీవ్ర సంచలనంగా మారింది. పైగా నితీష్ పై ఆయన విమర్శలు ఎక్కు పెట్టడం బీజేపీ వ్యూహంలో భాగమేనని భావిస్తున్నారు. అమిత్ షాకు ఆర్పీ సింగ్ బాగా దగ్గర కావడంతో జేడీయూ తరపున తిరిగి ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేందుకు నితీష్ నిరాకరించారు. అందుకే ఆయన నితీష్ పై కోపాన్ని పెంచుకుని బీజేపీకి చేరువయ్యారు. ఇప్పుడు ఆయనను అడ్డం పెట్టుకుని పార్టీని చీల్చేందుకు బీజేపీ పావులు కదుపుతోందని నితీష్ భావిస్తూ వచ్చారు. రాజకీయంగా నితీష్ ను బలహీనపరుస్తూ వస్తున్న బీజేపి ఇక సొంతంగా బీహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టిందన్న అనుమానాలు కూడా ఎక్కువయ్యాయి. దీంతో నష్ట నివారణకు అనుసరించాల్సిన మార్గాలపై నితీష్ దృష్టి పెట్టారు. అన్ని అంశాలపై పార్టీ కీలక నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపి.. ఎన్.డీ.ఏకు గుడ్ బై చెప్పారు. ఒకవైపు నితీష్ తన పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే .. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి నివాసంలో మహా కూటమి నేతలు సమావేశం నిర్వహించి, నితీష్ సర్కార్ కొనసాగేందుకు మద్దతుగా లేఖలపై సంతకాలు చేశారు. అలాగే కొత్త ప్రభుత్వంలో తమ పార్టీ కూడా చేరుతుందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రకటించారు.
మొత్తం 243 స్ధానాలున్న బీహార్ అసెంబ్లీలో జేడీయుకి ఉన్నది కేవలం 45 మంది శాసన సభ్యులే. బీజేపీకి 77 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. హిందుస్తాన్ అవామీ మోర్చా, ఇండిపెండెంట్ సభ్యులు ఐదుగురుతో కలిపి మొత్తం 127 మంది సభ్యుల బలంతో నితీష్ నాయకత్వంలో ఎన్.డీ.ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక మహా కూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల పార్టీలకు చెందిన వారు 115 మంది ఉన్నారు. ఇప్పుడు ఎన్.డీ.ఏ నుంచి బయటకు వచ్చిన నితీష్.. మహా కూటమి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఆయన సంప్రదింపులు జరిపారు. బీజేపీతో తెగదెంపులు చేసుకుని బయటకు వస్తే తాము మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని ఇంతకుముందే ప్రకటించిన ఆర్జేడీ.. నితీష్ తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. విపక్ష పార్టీలన్నీ కూడా నితీష్ కు మద్దతు పలికాయి. దీంతో సర్కార్ ఏర్పాటు చేసే దిశగా నితీష్పా వులు కదుపుతున్నారు. మహా కూటమి నేతలతో కలిసి గవర్నర్ ఫగూ చౌహాన్ కు తన రాజీనామా లేఖను అంద జేశారు. మహా కూటమి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించవలసిందిగా గవర్నర్ ను కోరారు. ఇంత జరుగుతున్నా బీజేపీ మాత్రం మౌనంగా అన్నీ గమనిస్తూ ఉంది. 2024లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలు, అలాగే 2025లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడియుతో నే కలిసి సాగుతామని బీజేపీ ప్రకటించి 10 రోజులు కూడా కాకముందే జేడీయూతో వ్యవహారం బెడిసి కొట్టింది. ఇప్పుడు బీజేపీ ఎలా స్పందించబోతోంది. అన్నది ఆసక్తిగా మారింది.