చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా లెఫ్టినెంట్ అనిల్ చౌహాన్
హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్ మరణించిన తొమ్మిది నెలల తర్వాత, కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ రిటైర్డ్‌ను ప్రభుత్వం బుధవారం నియమించింది. దేశం అత్యున్నత సైనిక అధికారిగా చౌహాన్ ఎంపికయ్యారు. సీడీఎస్ నియామకం త్వరలో చేస్తామని… ఆ ప్రక్రియ కొనసాగుతోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గత జులైలో ప్రకటించారు. చౌహాన్ భారత ప్రభుత్వ కార్యదర్శిగా, రక్షణ మంత్రిత్వి శాఖ నుంచి మిలిటరీ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు.

లెఫ్టినెంట్ జనరల్ చౌహాన్ మే 2021లో ఈస్టర్న్ కమాండ్ చీఫ్‌గా పదవీ విరమణ పొందారు. మిలిటరీలో ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. జమ్మూ&కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటు నిరోధక కార్యకలాపాలలో సత్తా చాటారు. భారతదేశపు మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా పనిచేసిన జనరల్ రావత్, ఆయన భార్యతోపాటుగా 13 మంది డిసెంబరులో తమిళనాడులో మిలిటరీ హెలికాప్టర్ కూలిపోవడంతో మరణించారు. ప్రాణాలతో బయటపడిన ఏకైక ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్, తరువాత తీవ్రమైన కాలిన గాయాలతో మరణించారు.

జనరల్ రావత్, 63, జనవరి 2020లో భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ అనే మూడు సేవలను ఏకీకృతం చేయడానికి ఈ స్థానాన్ని ఏర్పాటు చేశారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి శాశ్వత ఛైర్మన్, రాజకీయ నాయకత్వానికి నిష్పాక్షిక సలహా ఇవ్వడంతో పాటు రక్షణ మంత్రికి ప్రధాన సైనిక సలహాదారుగా ఉంటారు.