ఏపీ అప్పుల లెక్కలు చిట్టా…
నల్కొండ లోక్ సభ సభ్యుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ బీజేపీ ఎంపీ కిషన్ కపూర్ దేశవ్యాప్తంగా రాష్ట్రాల అప్పుల భారంపై అడిగిన ప్రశ్నకు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. స్టేట్ ఫైనాన్స్‌లు 2021–22 బడ్జెట్ల అధ్యయనం పేరుతో రిజర్వు బ్యాంక్ రూపొందించిన నివేదిక ప్రకారం గత మూడేళ్లుగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం బకాయిల వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేశారు. దీని ప్రకారం అప్పుల్లో తమిళనాడు రూ.6,59,868 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా, ఉత్తరప్రదేశ్ రూ.6,53,307 కోట్లు, మహారాష్ట్ర రూ.6,08,999 కోట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ మొత్తం అప్పు రూ.3,12,191.3 కోట్లుగా ఉందని తెలిపారు. అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో నిలిచింది. ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం అప్పులపై పలు దఫాలుగా వాస్తవాలను గణాంకాలతో సహా వివరించింది.
ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పులు 2022 మార్చి నాటికి బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.3,98,903.60 కోట్లని తేలింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం అప్పులకు సంబంధించి 2020 మార్చి చివరి నాటికి రుణాలు, 2021 మార్చి సవరించిన అంచనాలు, 2022 మార్చి నాటికి బడ్జెట్ అంచనాలను పార్లమెంట్‌కు వెల్లడించారు. ఈ ఏడాది మార్చి చివరికి బడ్జెట్ అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు రూ.3,98,903.6 కోట్లు కాగా చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి అంటే 2019 మే నెలాఖరు నాటికి రాష్ట్రం అప్పులు రూ.2,68,115.00 కోట్లుగా ఉన్నాయి. అంటే మూడేళ్లలో జగన్ ప్రభుత్వం రూ.1,30,788.6 కోట్లు మాత్రమే అప్పులు చేసినట్లు అర్ధమవుతోంది.. ఏపీలో బడ్జెట్ కేటాయింపులు లేకుండా రూ.లక్షల కోట్లు వ్యయం చేశారని, అది కేంద్రం దృష్టికి వచ్చిందా, వస్తే ఏం చర్యలు తీసుకున్నారంటూ టీటీపీ సభ్యుడు కనకమేడల రాజ్యసభలో ఈ మధ్య ప్రశ్నించారు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇస్తూ 2014–15 నుంచి 2018–19 వరకు చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రూ.1.62 లక్షల కోట్లకు లెక్కలు లేవని, అసెంబ్లీ ఆమోదం లేకుండా ఖర్చుచేశారని వెల్లడించారు. కాగ్ నివేదికలోకూడా ఇది స్పష్టంగా ఉందని తెలిపారు.
ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి బడ్జెట్ అంచనాల మేరకు వివిధ రాష్ట్రాల అప్పుల వివరాలను ఆర్థికమంత్రి లోక్‌సభకు తెలియచేశారు. రాష్ట్రాల అప్పులకు ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ప్రతి ఏడాది కేంద్ర ఆర్థిక శాఖ అనుమతులు ఇస్తుందని, దాని ప్రకారమే అప్పులు చేస్తాయని, ఏ ఆర్థిక సంవత్సరంలో నైనా అనుమతికి మించి అప్పులు చేస్తే మరుసటి సంవత్సరంలో సర్దుబాటు చేస్తుందని సమాధానం ఇచ్చారు. ఏపీ సర్కారు అత్యధికంగా అప్పులు చేస్తోందని, ఏకంగా రూ.8 లక్షల కోట్లకుపైగా రుణాలు ఉన్నాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంలో కొంచెంకూడా నిజం లేదని తాజాగా పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనతో తెలిసింది. అప్పుల్లో ఏపీ దేశంలోనే నంబర్ వన్ అంటూ చేస్తున్న అసత్య ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన వల్ల తెలుస్తోంది.