తప్పొప్పుకున్న కేటీఆర్… నిరుద్యోగులకు ధోకా
నీళ్లు, నిధులు, నియామకాల గురించి కోసం నాడు యువత కొట్లాడింది. ఆత్మబలిదానాలు చేసుకొంది. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఎందరో నిరుద్యోగులు అసువులుబాశారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని కలలుగన్నారు. నోటిఫికేషన్లు వస్తాయని ఆశపడ్డారు. కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదేళ్లయినా నోటిఫికేషన్లకు అతీగతీ లేదు. తెలంగాణలో నిరుద్యోగులంతా గుస్సాగా ఉన్నారన్న కారణంగా, ఏడాదిగా నోటిఫికేషన్లంటూ కేసీఆర్ సర్కారు వంచిస్తోంది. అసలు ఉద్యోగాలు భర్తీ చేయాలన్న సోయ ఉందో లేదో కూడా తెలియనట్టుగా మొత్తం పరీక్షల నిర్వహణ కన్పిస్తోంది. ఎన్నికల్లో గెలవడం కోసం, నిరుద్యోగులను మభ్యపెట్టడం కోసం బీఆర్ఎస్ పార్టీ గత ఏడాదిగా నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు ఇచ్చింది. చిత్తశుద్ధి లేని శివపూజలా ఆ తంతు జరిగుతోంది. టీఎస్పీఎస్సీ నిర్వాకంతో అసలు నియామకాల విషయంలో ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే.

ఇప్పటి వరకు జాబ్ కేలండర్ విషయంలో క్లారిటీ ఇవ్వని గులాబీ నేతలు ఇప్పుడు టీఎస్పీఎస్సీలో తప్పులు జరిగాయని ఎన్నికల ప్రచారంలో ఒప్పుకుంటున్నారు. సాక్షాత్తూ సీఎం కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. టీఎస్పీఎస్సీలో తప్పులు జరిగాయని ఒప్పుకోడానికి ధైర్యం కావాలన్నారు. వివిధ దశల్లో ఉన్న 80 వేల ఉద్యోగాల భర్తీ చేపట్టడంతోపాటు, వచ్చే రోజుల్లో జాబ్ కేలండర్ ప్రకటించి నియామకాలు చేపడతామన్నారు. టీఎస్పీఎస్సీ తప్పులు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేసింది. పేపర్లు లీక్ అవుతుంటే ఏ చర్యలు చేపట్టింది. నిరుద్యోగులు పిట్టల్లా రాలుతుంటే ఏం చేసింది? వేలకు వేల రూపాయలతో కోచింగ్ సెంటర్లలో విద్యార్థులు పడిగాపులు కాస్తుంటే వారికి భరోసా ఇచ్చిందా? పేపర్ల లీకేజీలో దోషులను పట్టుకునే ప్రయత్నం చేసిందా? అంటే లేదనే చెప్పాలి. అసలు పరీక్షలు నిర్వహించడమే చేతగానట్టుగా మొత్తం వ్యవహరాన్ని నడిపించింది.

పరీక్ష నిర్హహణపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలను పెడచెవిన పెట్టింది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు సంబంధించి నానా యాగీ చేసింది. హైకోర్టు సింగిల్ బెంచ్ పరీక్ష రద్దు చేస్తే డివిజన్ బెంచ్‌కు వెళ్లింది. ఐతే ఐ బెంచ్ సైతం పరీక్ష మళ్లీ నిర్వహించాలని చెప్పింది. ఒకసారి పేపర్ లీకేజీ కారణంగా రద్దైన పరీక్ష నిర్వహణలో మళ్లీ అదే నిర్లక్ష్యం సరికాదన్నారు. బయోమెట్రిక్ విధానం అమలు చేస్తామని నోటిఫికేషన్ లో ప్రకటించి…ఎందుకు అమలు చేయాలని ప్రశ్నించింది. మీ నిబంధనలు మీరే ఉల్లంఘిస్తే ఎలా అని ప్రశ్నించింది. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నారా? ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతున్న వారి పరిస్థితిని ఎందుకు అర్థం చేసుకోలేదని వ్యాఖ్యానించింది. ఇలా మొట్టికాయలు పడినప్పటికీ సర్కారు పెద్దలకు మాత్రం చీమకుట్టినట్టయినా లేదు. పైపెచ్చు తమకు ఏం సంబంధం లేదన్నట్టుగా వాదనలు విన్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగులు ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తారన్న టెన్షన్ ఇప్పుడు గులాబీ నేతలను పట్టిపీడిస్తోంది.

