NationalNews

మోదీపై నోరుపారేసుకున్న ఖర్గే.. రావణుడిల వంద తలలున్నాయా అంటూ కామెంట్స్..!

ప్రధాని నరేంద్ర మోదీని రావణుడు అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్య గుజరాత్ ఎన్నికల ప్రచారం మధ్యలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. సన్ ఆఫ్ గుజరాత్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే విమర్శిస్తున్నారంటూ బీజేపీ దెప్పిపొడిచింది. వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అహ్మదాబాద్‌లో జరిగిన ర్యాలీలో ఖర్గే ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీజీ ప్రధాని పని మర్చిపోయి కార్పొరేషన్‌ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు ఇలా ప్రతి చోటా ప్రచారం చేసుకుంటూనే ఉంటారు. ఎప్పుడూ తన గురించే మాట్లాడుకుంటున్నారు. మోదీకి ఎన్నిసార్లు ఓటేస్తారని ఖర్గే ప్రశ్నించారు. ప్రతి ఎన్నికల్లోనూ అభ్యర్థులు ప్రధాని మోదీ పేరుతో ఓట్లు అడుగుతున్నారని కాంగ్రెస్ చీఫ్ విమర్శించారు.

మున్సిపాలిటీ ఎన్నికలైనా, కార్పొరేషన్ ఎన్నికలైయినా, రాష్ట్ర ఎన్నికలైనా సరే.. మోదీ పేరుతో ఓట్లు అడగడం చూస్తున్నామన్నారు ఖర్గే. అభ్యర్థి పేరుతో ఓట్లు అడగండి.. మోదీ వచ్చి మున్సిపాలిటీకి పని చేస్తారా? మీకు అవసరమైన సమయంలో మోదీ మీకు సహాయం చేస్తాడా… అని ఖర్గే ప్రశ్నించాడు. మోదీజీ ప్రధాని పని మరిచిపోయి కార్పోరేషన్ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు ఇలా ప్రతి చోటా ప్రచారం చేసుకుంటూనే ఉన్నాడన్నారు. అన్ని వేళలా తన గురించే మాట్లాడుకుంటున్నాడని… ‘ఇంకెవరినీ చూడనవసరం లేదు, మోదీని చూసి ఓటేయండంటున్నారన్నారు. మీ ముఖాన్ని ఎన్నిసార్లు చూస్తాము? మీకు ఎన్ని రూపాలు ఉన్నాయి? మీకు రావణుడిలా 100 తలలు ఉన్నాయా? అంటూ ప్రశ్నించాడు.

ఖర్గే వ్యాఖ్యలకు బీజేపీ అంతే తీవ్రంగా కౌంటర్ ఇచ్చింది. బీజేపీ ఐటీ సెల్‌ నేత అమిత్ మాల్వియా… ఖర్గేపై విరుచుకుపడ్డారు. గుజరాత్ ఎన్నికల వేడిని తట్టుకోలేక కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తన మాటలపై నియంత్రణ కోల్పోయారన్నారు. అందుకే ప్రధాని నరేంద్ర మోడీని రావణ్ అని పిలుస్తున్నారంటూ మండిపడ్డారు. “మౌత్ కా సౌదాగర్” నుండి “రావణ్” వరకు కాంగ్రెస్ గుజరాత్‌ను అవమానిస్తూనే ఉందని… సన్ ఆఫ్ గుజరాత్‌ను అవమానిస్తున్నారంటూ దుయ్యబట్టారు. 2007 గుజరాత్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వివాదాస్పదమైన మరణాల వ్యాపారి అంటూ వ్యాఖ్యానించారని మాల్వియా గుర్తు చేశారు. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని మోదీని ఉద్దేశించి సోనియా ట్వీట్ చేశారన్నారు. గుజరాత్‌లో డిసెంబర్ 1, 5 తేదీల్లో పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 8న ఫలితాలు వెల్లడవుతాయి.