NewsNews AlertTelangana

కేసీఆర్‌కు అహంకారం పెరిగింది: ఈటల

తెలంగాణ ప్రజలు రెండోసారి అధికారం కట్టబెట్టిన తర్వాత సీఎం కేసీఆర్‌కు అహంకారం పెరిగిందని బీజేపీ నేత, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు గన్‌పార్క్‌ వద్ద అమర వీరుల స్థూపానికి ఈటల, రఘునందన్‌ నివాళులు అర్పించారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ప్రజా సమస్యల వేదిక అయిన అసెంబ్లీని కూడా మొక్కుబడిగా నిర్వహిస్తున్నారన్నారు. అసెంబ్లీ అంటే గౌరవ, మర్యాదలు లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేసి.. పనికిమాలిన సభలా మార్చేశారన్నారు. గత సమావేశాల్లో తమను అకారణంగా బయటికి పంపించేశారని ఆవేదన చెందారు.

రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా లేరు

తెలంగాణాలో ఎవరూ సంతోషంగా లేరని, వీఆర్‌ఏ, వీఆర్‌వోల ఆత్మహత్యలు పెరిగాయని, గెస్ట్‌ లెక్చరర్ల బతుకులు దుర్భరంగా మారాయని ఈటల ఆరోపించారు. సమస్యలు పరిష్కరించాలంటూ చాలా మంది తమ ముందు గోడు వెళ్లబోసుకున్నారని, వాటిపై సభలో చర్చించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. అయితే.. సమావేశాలు 6, 12, 13 తేదీల్లోనే ఉంటాయని నోటీసు పంపించారని, శాసన సభ చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదన్నారు. ప్రభుత్వం తేదీలు ప్రతిపాదిస్తే బీఏసీ (బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ) నిర్ణయం తీసుకోవడం రివాజు అని.. ఇక్కడ మాత్రం అన్ని నిర్ణయాలూ కేసీఆరే తీసుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్‌ అహంకారం నియంతృత్వానికి నిదర్శనమని, ఈ ప్రభుత్వం మెడలు వంచుతామని ఈటల ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ జాతి ఆత్మగౌరవం కోసమే బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తోందని.. తమ ఒత్తిడికి తలొగ్గిన సీఎం కేసీఆర్‌ తప్పని పరిస్థితుల్లోనే ఈ ఉత్సవాలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారని ఈటల అన్నారు. ఇది ప్రజల మీద ప్రేమ కాదని, ఇప్పటికైనా ఉత్సవాలు జరపడం సంతోషం అన్నారు.