NationalNews

కేసీఆర్‌ జాతీయ పార్టీ దసరాకే..!

కేసీఆర్‌ జాతీయ పార్టీకి ముహూర్తం ఫిక్స్‌ అయింది. దసరా పండుగ రోజునే జాతీయ పార్టీని ప్రకటించేందుకు అన్నీ సిద్ధం చేస్తున్నారు.  అక్టోబరు 5వ తేదీన హైదరాబాద్‌లో అందుబాటులో ఉండాలని టీఆర్‌ఎస్‌ కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అధిష్టానం నుంచి ఆదేశాలు వెళ్లాయి. పార్టీ పేరుతో పాటు జెండాను, అజెండాను కూడా అదే రోజు ఖరారు చేయనున్నారు. దీనికి సంబంధించి ఫామ్‌హౌస్‌లో కూర్చుని కేసీఆర్‌ కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌తో పొత్తుకూ సై..

కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని కోరుతూ టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కమిటీలు ఇప్పటికే తీర్మానాలు చేశాయి. ప్రాంతీయ పార్టీల అధినేతలతో, తమిళనాడు, బిహార్‌, ఢిల్లీ, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రులతో కేసీఆర్‌ వరుస సమావేశాలు కూడా నిర్వహించారు. బీజేపీ విధానాలపై, కేంద్ర, బీజేపీ ప్రభుత్వాల తీరుపై విరుచుకు పడుతున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికైనా కేసీఆర్‌ సానుకూలంగానే ఉన్నారు.

ఎన్నికల వరకు కేసీఆరే సీఎం..

అసెంబ్లీ ఎన్నికల వరకూ సీఎంగా కొనసాగాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ఎన్నికల తర్వాత నాటి పరిస్థితిని బట్టి సీఎం పదవిపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. అయితే.. తెలంగాణాలో హ్యాట్రిక్‌ విజయం సాధిస్తేనే జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంటుందని కేసీఆర్‌ గట్టిగా విశ్వసిస్తున్నారు. బీజేపీ మాత్రం కేసీఆర్‌ను తెలంగాణాకే పరిమితం చేసేందుకు వ్యూహాలు రూపొందిస్తోంది.

భారత రాష్ట్ర సమితి పార్టీ..

త్వరలో భారీ బహిరంగ సభను నిర్వహించి పార్టీ జెండాను, ఎజెండాను ఆ సభలో కేసీఆర్‌ ప్రకటిస్తారని సమాచారం. భారత దేశ చిత్ర పటం, గులాబీ రంగుతో కూడిన జెండాను రూపొందించినట్లు తెలుస్తోంది. ఎజెండాలో రైతులు, దళితులు, యువతకు పెద్దపీట వేస్తారని సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు వంటి సంక్షేమ కార్యక్రమాల మోడల్‌ను జాతీయ స్థాయిలో అమలు చేస్తామని ప్రజలకు వివరించే అవకాశం ఉంది. పార్టీ పేరును ‘భారత రాష్ట్ర సమితి’గా నిర్ధారించినట్లు చెప్పుకుంటున్నారు. మొత్తానికి దసరా రోజున సస్పెన్స్‌ వీడనుంది.