కామన్ వెల్త్ గేమ్స్‌లో మరో రెండు పసిడి పతకాలు
కామన్ వెల్త్ గేమ్స్ లో ఇండియా వెయిట్ లిఫ్టర్లు పతకాల పంట పండిస్తున్నారు. శనివారం మిరాయభాయి చాను, బింద్యారాణి సత్తా చాటితే… ఆదివారం సైతం ఆటగాళ్లు దుమ్మురేపారు. 67 కిలోల విభాగంలో జెరెమీ లిల్రినుంగా బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. మొత్తం 300 కిలోల బరువు ఎత్తి విజేతగా నిలిచాడు. కామన్ వెల్త్ గేమ్స్ లో సరికొత్త రికార్డు నమోదు చేశాడు. ఇక రాత్రి అచింత షూలి 73 కిలోల విభాగంలో మరో పసిడి విజయం సాధించాడు. స్థిరంగా బరువులు ఎత్తుతూ మూడో ప్రయత్నంలో 170 కిలోల బరువు ఎత్తి… 313 కిలోల రికార్డు సృష్టించి… బెంగాలీ బాబు సత్తా చాటాడు. ఇప్పటికే 57 కిలోల విభాగంలో బింద్యా రాణి సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నారు.
ఇక కామన్ వెల్త్ గేమ్స్ లో భాగంగా క్రికెట్‌లోనూ భారత్ అదరగొట్టింది. పాకిస్తాన్ మహిళల క్రికెట్ ను భారత ఆటగాళ్లు చిత్తుగా ఓడించారు.స్మృతి మంధాన 42 బంతుల్లోనే 63 పరుగులు సాధించడంతో పాక్ జట్టుపై టీమ్ ఇండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక భారత బాక్సర్ నిఖత్ జరీన్ కామన్ వెల్త్ గేమ్స్ లో అద్భుతమైన ఆరంభానిచ్చారు. మహిళల 50 కిలోల విభాగంలో ముందుకు దూసుకుపోతోంది. చెస్ ఒలింపియాడ్ లోనూ భారత్ దూకుడు కొనసాగుతోంది. మూడు రోజు భారత్ ఆటగాళ్లు తిరుగులేదనిపిస్తోన్నారు. టోర్నీలో పాల్గొంటున్న ఆరు జట్లు విజయం సాధించాయ్. ఇక ఇండియన్ క్రికెట్ టీమ్ ఇవాళ వెస్టిండీస్ తో రెండో టీ 20 మ్యాచ్ ఆడబోతోంది. తొలి మ్యాచ్ లో విజయం సాధించిన రోహిత్ సేన, రెండో మ్యాచ్ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది.