గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల కేసీఆర్ పోటీ
బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ విడుదల చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను కేసీఆర్ మార్చారు. పలువురు నేతలకు టికెట్లు లభించవని ప్రచారం జరిగినప్పటికీ కేసీఆర్ ఈసారి సిట్టింగ్‌లపై భరోసా ఉంచారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని పట్టుదలతో ఉన్న కేసీఆర్, అనవసరమైన తలనొప్పులు వద్దనుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయడంపై ఇప్పుడు పలు ఊహాగానాలు విన్పిస్తున్నాయి. గతంలో గజ్వేల్ నుంచి తాను బరిలో దిగేందుకు సిద్ధమంటూ బీజేపీ ముఖ్యనేత ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. అయితే మారిన తాజా రాజకీయ పరిణామాలతో పోటీ ఎలా ఉంటుందన్నది చూడాల్సి ఉంది. ఖానాపూర్ సిట్టింగ్ స్థానంలో బుక్యా జాన్సన్ రాథోడ్ నాయక్, కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తనయుడు సంజయ్‌కు, స్టేషన్ ఘన్ పూర్ లో రాజయ్యకు బదులు కడియం శ్రీహరి టికెట్లు కేటాయించారు. ఇక నర్సాపూర్, జనగాం, నాంపల్లి, గోషామహల్ అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి స్థానంలో ఉప్పల్ బండారు లక్ష్మారెడ్డికి కేటాయించారు. దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డికి ఇచ్చారు. హుజూరాబాద్ సీటును పాడి కౌశిక్ రెడ్డికి కేటాయించారు.