బీజేపీ నేతలపై కవిత పరువు నష్టం దావా
ఢిల్లీ లిక్కర్ కేసులో తనపై ఆరోపణలు చేసిన ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ శర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సిర్సాలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరువు నష్టం దావా వేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో తనకు సంబంధం లేదని, వాళ్లు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ తెలంగాణాలోని 33 జిల్లా కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. కేసీఆర్ బిడ్డను బద్నాం చేస్తే కేసీఆర్ భయపడతారని బీజేపీ వాళ్లు భ్రమ పడుతున్నారని, తాను భయపడేది లేదని.. కోర్టులోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను మానసికంగా కృంగదీయాలని చూస్తున్నారని, వారి ఎత్తుగడలు ఫలించవని ధీమా వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థలకు తాను పూర్తిగా సహకరిస్తానన్నారు.

ఇలాంటివి రిపీట్ అయితే మా సత్తా చూపుతాం: తలసాని
కవిత ఇంటిపై బీజేవైఎం నాయకుల దాడిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. టీఆర్‌ఎస్ సైన్యం తిరగబడితే రాష్ట్రంలో ఒక్క బీజేపీ నాయకుడూ తట్టుకోలేడని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్‌తో కలిసి ఆయన కవిత ఇంటికి వెళ్లి ఆమెకు సంఘీభావం తెలిపారు.

