బీజేపీకి జై కొట్టిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో తాను బీజేపీ లో చెరబోతున్నట్టు ప్రకటించారు. ఈటల గెలుపుతో టీఆరెస్ సగం ఓడిపోయిందన్నారు కొండా. తెలంగాణ లో ఇంకో బై ఎన్నికలు వస్తే బీజేపీ గెలుస్తుందన్నారు. బీజేపీ అంటే కులం లేని హిందూత్వ పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీని తప్పు పడితే ఓట్లు రావన్నారు. కేసీఆర్ ని నిలదీస్తే ఓట్లు పడతాయన్నారు. టీఆర్ఎస్ దోచుకున్నది గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు కళ్ళకు కనిపిస్తుందన్నారు. జులై 2 లేదా 3న బీజేపీ కండువా కప్పుకుంటానని ఆయన ప్రకటించారు.
తెలంగాణలో కాంగ్రెస్ కి టీఆర్ఎస్ ను ఓడగొట్టే దమ్ము లేదన్నారు కొండా. తెలంగాణలో కుటుంబ పాలన వెళ్లి ప్రజా పాలన వచ్చేది బీజేపీ తోనే సాధ్యమన్నారు. 2సంవత్సరాలు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. టిఆర్ఎస్ ని ఎదుర్కొనేందుకు అధిష్టానం నుండి బీజేపీ రాష్ట్ర నేతలకు అన్ని అండదండలు ఉన్నాయన్నారు. దేశ వ్యాప్తంగా మోడీ హవా నడుస్తోందన్నారు. ప్రజాస్వామ్యన్ని నిలబెట్టేందుకు రాజకీయాల్లోకి వచ్చానన్న కొండా వ్యక్తిగత స్వార్ధం కోసం రాజకీయాలలోకి రాలేదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి లో ఉంటుందనుకుంటే అప్పుల రాష్ట్రంగా తయారయ్యిందన్నారు. టిఆర్ఎస్ పాలనలో రంగారెడ్డి జిల్లాకు పూర్తిగా అన్యాయం జరిగిందని… అభివృద్ధి లో వెనకబడిందన్నారు. రాష్ట్రంలో నియంతపాలన సాగుతోందని… కేసీఆర్ ఉద్యమ కారులను మోసం చేసి ఉద్యమ ద్రోహులను అక్కున చేర్చుకుంటున్నాడని కొండా విమర్శించారు. దోచుకోవడమే ఎజెండాగా కేసీఆర్ పాలన ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ వ్యతిరేక ఓటు బీజేపీ అందిపుచ్చుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చనిపోయాక రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పజెప్పారని… కేంద్ర ప్రభుత్వం తో రాష్ట్ర ప్రభుత్వం సఖ్యతతో ఉంటేనే నిధులు తెచ్చుకోవచ్చన్నారు. ఇంకో బై ఎలక్షన్ వస్తే టిఆర్ఎస్ పూర్తిగా అంతరించిపోతుందన్నారు కొండా.