రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ‘కౌలుబంధు’
భూస్వాములకు రైతుబంధు రద్దు చేస్తాం
మునుగోడు ప్రజలు మందుకు లొంగరు
టీఆర్‌ఎస్ దొంగచాటు పోస్టర్లు: ఈటల
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే భూస్వాములకు రైతుబంధును రద్దు చేస్తామని.. కౌలు రైతులకు కౌలుబంధు ఇస్తామని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. మునుగోడు నియోజక వర్గంలోని చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామంలో ఆయన శనివారం బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో మునుగోడు బిడ్డలే ఎక్కువగా చనిపోయారని గుర్తు చేశారు. ఇక్కడ గల్లీగల్లీలో బెల్ట్ షాపులు నిర్వహిస్తూ మహిళలకు నరకం చూపిస్తున్నారని.. ఏకంగా మంత్రి మల్లారెడ్డి మద్యం తాగుతూ, తన అనుచరులకు తాగిస్తూ మునుగోడు ప్రజలను అవమానించారని విమర్శించారు.

ఆ పోస్టర్లు బూటకం..
బీజేపీని గెలిపించి బాధపడుతున్నామంటూ హుజూరాబాద్, దుబ్బాక ప్రజల పేరుతో వెలసిన పోస్టర్లు బూటకమని ఈటల అన్నారు. నిజానికి హుజూరాబాద్‌లో తాను గెలిచిన రోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలంతా బాణసంచా కాల్చి దీపావళి పండుగ చేసుకున్నారని గుర్తు చేశారు. బీజేపీని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక టీఆర్‌ఎస్ నాయకులు దొంగ సంస్థల పేరుతో దొంగచాటుగా పోస్టర్లు వేయించారని విమర్శించారు. చైతన్యానికి హుజూరాబాద్ మారు పేరు అన్నారు. మునుగోడు ప్రజలు కూడా హుజూరాబాద్ ప్రజలను ఆదర్శంగా తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఓటు.. ఏకే 47 కంటే విలువైనది..
మునుగోడు ప్రజలు డబ్బు, మద్యానికి లొంగరని ఈటల ఆశాభావం వ్యక్తం చేశారు. మన చేతిలో ఉన్న ఓటు.. ఏకే 47 గన్ను కంటే విలువైనదని.. ప్రజల తలరాతను మార్చే ఓటును అమ్మకోవద్దని ప్రజలకు సూచించారు. కేసీఆర్ అహంకారాన్ని బొంద పెట్టాలని.. రాష్ట్రంలో కేసీఆర్ పీడ తొలగి పోవాలన్నదే తన లక్ష్యం అన్నారు. అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైన టీఆర్‌ఎస్ ప్రభుత్వం మునుగోడు ఫలితం వచ్చిన మూడు నెలల్లో కూలిపోతుందని జోస్యం చెప్పారు.

