కన్నా దారేటు.. బీజేపీని వీడతారా ?
◆ కొంత కాలంగా అసంతృప్తితో ఉన్న కన్నా
◆ పార్టీ శ్రేణులను పట్టించుకోని నాయకత్వం
◆ నాయకత్వాన్ని కలుపుకోకపోవడమే కారణం
◆ కన్నా టిడిపిలోకి వెళ్తారని జోరుగా ప్రచారం
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడి టీడీపీలో చేరతారని ప్రచారం ప్రస్తుతం ఏపీలో హల్చల్ చేస్తోంది. గత కొంతకాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్న కన్నా తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పనితీరుపై ఆయన విరుచుకుపడ్డారు. పార్టీలో ఆయన వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో శ్రేణులను నాయకత్వాన్ని కలుపుకుపోకుండా పనిచేస్తున్నారని విమర్శించారు. గుంటూరులో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీలో చర్చకు కారణమవుతున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ విషయంలో అధిష్టానం వైఖరిపై కన్నా అసహనం వ్యక్తం చేశారు. పవన్‌తో సఖ్యత విషయంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందని కన్నా ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేన అధ్యక్షుడుతో సమన్వయం చేసుకోవడంలో సోము వీర్రాజు ఫెయిలయ్యారని ఆయన నిర్వాకం వల్లే బీజేపీలో సమస్యలు ఉత్పన్నమవుతాయని తన మనసులోని మాటను కక్కేశారు.

రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసిన కన్నా తన అనుచరులు కీలక నేతలతో సమావేశం అయ్యారు. సీనియర్ నేత ఆయన తనను పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని తన అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవటం లేదని ఈ నేపథ్యంలో ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోవాలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తుంది. అందరితో మాట్లాడిన అనంతరం కన్నా తీసుకునే నిర్ణయంపై ఆయన అనుచరులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకొని రానున్న ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ స్థానానికి ఆయన పోటీ చేస్తారని అందరూ భావిస్తున్నారు. మరి కన్నా బీజేపీని వీడతారా ? ఏ పార్టీలో చేరతారో కొన్ని రోజుల్లో తేలనుంది.

