NationalNews

జియో 5జీ @ రూ.8000-12000

జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను గూగుల్‌తో కలిసి తీసుకొచ్చేందుకు రిలయన్స్‌ ప్లాన్‌ చేస్తోంది. వచ్చే నెలలో దీపావళి నాటికి మార్కెట్‌లోకి రానున్న ఈ ఫోన్‌ ధర రూ.8000-12,000 మధ్య ఉంటుందని కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ నివేదిక అంచనా వేసింది. ప్రస్తుతం 4జీ వినియోగిస్తున్న వారిని 5జీకి మార్చడమే లక్ష్యంగా దీన్ని తీసుకొస్తున్నామని జియో తెలిపింది. 5జీ నెట్‌వర్క్‌ విస్తరించిన తర్వాత ఈ స్మార్ట్‌ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయాలని నివేదిక పేర్కొన్నది. ఈ ఫోన్‌లో వినియోగించే ఎలక్ట్రానిక్‌ పరికరాల కోసం క్వాల్‌కామ్‌, శామ్‌సంగ్‌, సింటియంట్‌ సహా కొరియా, చైనాకు చెందిన పలు కంపెనీలతో జియో ఒప్పందం కుదుర్చుకుంది.

తొలుత మెట్రో నగరాల్లో 5జీ సేవలు..

5జీ సేవలను అక్టోబరు ఒకటవ తేదీన ఢిల్లీలో జరిగే ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ సదస్సులో ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ సేవలు తొలుత ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ వంటి మెట్రో నగర వాసులకు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే ఏడాదికి అన్ని ప్రధాన నగరాలకు విస్తరిస్తారు. 4జీతో పోలిస్తే 5జీ సేవల వేగం 7-10 శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో 5జీ సేవలు అందుబాటులోకి వస్తే హైక్వాలిటీ వీడియోలను ఎలాంటి బఫరింగ్‌ లేకుండా చూసుకోవచ్చు. హై గ్రాఫిక్స్‌ గేమ్స్‌ను ప్లే చేసుకోవచ్చు. కనెక్షన్‌ స్లో అవుతుందన్న భయం లేకుండా పలు రకాల ఉపకరణాలను వినియోగించుకోవచ్చు.

మన ఫోన్‌ 5జీకి సపోర్టు చేస్తుందా..

మన ఫోన్‌ 5జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్‌ చేస్తుందో.. లేదో.. తెలుసుకోవడం సులువే. నిజానికి మన దేశంలో 5జీ ఫోన్‌ 2019లోనే వచ్చింది. ఫోన్‌ నెట్‌వర్క్‌ సెట్టింగ్స్‌ లేదా సిమ్‌కార్డుకు సంబంధించిన ప్రిఫర్డ్‌ నెట్‌వర్క్‌ను పరిశీలిస్తే మన ఫోన్‌ 5జీ సేవలకు సపోర్టు చేస్తున్నదీ.. లేనిదీ.. తెలుసుకోవచ్చు. ప్రిఫర్డ్‌ నెట్‌వర్క్‌ 5జీ అని సూచిస్తే.. ఫోన్‌ 5జీకి సపోర్టు చేస్తున్నట్లు.. మొబైల్‌ నెట్‌వర్క్‌ సెట్టింగ్స్‌లో 5జీ కనిపించకుంటే ఫోన్‌ 5జీకి సపోర్ట్‌ చేయదని అర్ధం. అప్పుడు 5జీని సపోర్ట్‌ చేసే ఫోన్‌ను కొనుగోలు చేయాలి.