దళితుడిపై జనసేన ఎమ్మెల్యే దౌర్జన్యం
ఏపీలో కూటమి నేతలు రెచ్చిపోతున్నారన్న విమర్శలను నిజం చేశారు కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ. రంగరాయ మెడికల్ కాలేజీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడికి తెగబడ్డారు. కాలేజీలో వాలీబాల్ ఆడుకునేందుకు అనుమతివ్వాలని ఎమ్మెల్యే కోరారు. అయితే ఉన్నతాధికారులు అనుమతిస్తే అందుకు అవకాశం ఇస్తానని ఉమామహేశ్వరారవు చెప్పారు. దీనిని ఎమ్మెల్యే అనుచరులు పట్టించుకోలేదు. మీరేంటి మాకు అనుమతిలిచ్చేదన్నట్టుగా రెచ్చిపోయారు. ఎలాంటి అనుమతివ్వకపోయినప్పటికీ, గ్రౌండ్‌లో ఎమ్మెల్యే నానాజీ అనుచరులు నెట్ కట్టడానికి ప్రయత్నించారు. దీంతో అనుమతి వచ్చిన తర్వాత ఏదైనా చేసుకోవాలని ఉమామహేశ్వరరావు చెబుతున్నప్పటికీ ఎమ్మెల్యే వర్గీయులు ఆగలేదు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అక్కడకి వచ్చి ఉమామహేశ్వరరావును నానా దుర్భాషలాడారు. ఆయన ధరించిన మాస్క్ పీకేసి అనుచరులతో కలిసి దాడి చేశారు. ఒక్కసారిగా ఉమామహేశ్వరరావు షాక్ కు గురయ్యాడు. దళితులపై ఇలాంటి అరచాకాలు చేయడమేంటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు.

