జనసేనలోకి కన్నా లక్ష్మీనారాయణ వెళ్తారా?
చర్చనీయాంశంగా మారిన కన్నా లక్ష్మీనారాయణ, మనోహర్ భేటీ
ఏపీలో బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణతో జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ బుధవారం రాత్రి గుంటూరులో ఆయన నివాసంలో సమావేశం అవటం, 45 నిమిషాల పాటు ఏకాంతంగా మాట్లాడటం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం రాష్ట్ర బీజేపీ లో మరోసారి కలకలం రేపుతుంది. రాష్ట్ర నాయకత్వ తీరు జనసేనతో అంటి ముట్టని వ్యవహారాలపై గతంలో బహిరంగ ఆరోపణలు చేసిన కన్నా లక్ష్మీనారాయణ కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలలో సైతం అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలోనే బీజేపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ బయటకు వెళ్తారని ప్రచారం విస్తృతంగా సాగింది.

కన్నాను టీడీపీ లో చేర్చుకొని ఆయన సీనియార్టీ కి తగిన ప్రాధాన్యం కల్పించాలని టీడీపీ నాయకత్వం భావిస్తుందని కూడా వార్తలు వచ్చాయి. ఆయన టీడీపీ లో చేరటం ఖాయమని కూడా కొద్ది రోజులుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా వ్యవహరించిన కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో 2020 ఆగస్టులో సోము వీర్రాజు ను పార్టీ అధ్యక్షునిగా బీజేపీ అధిష్టానం నియమించింది. కన్నాకు జాతీయ కార్యవర్గంలో స్థానం కల్పించారు. అయితే రెండేళ్ల తర్వాత మరోసారి అధ్యక్ష పదవి తనకు దక్కుతుందని భావనలో కన్నా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రజా పోరు, వీధి సభల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ జాతీయ సహ సంఘటన మంత్రి శివ ప్రకాష్ సోము వీర్రాజు నేతృత్వంలోనే 2024 ఎన్నికలకు వెళ్తున్నట్లు స్పష్టమైన ప్రకటన చేయటంతో అప్పటి నుంచే కన్నా లక్ష్మీనారాయణ కొంత అసంతృప్తిగా ఉన్నారు. శివప్రకాష్ ప్రకటన తర్వాత కొద్ది రోజులకే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహార శైలిపై కన్నా బహిరంగ విమర్శలు చేశారు. కోర్ కమిటీలో చర్చిస్తున్న అంశాలు, పార్టీ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు భిన్నంగా ఉంటున్నట్లు ఆయన ఆరోపించారు.

ఇదే సమయంలో జనసేనతో కలిసి వెళ్లడంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో కన్నా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేకెత్తించాయి. పార్టీ మారే ఉద్దేశంతోనే కన్నా లక్ష్మీనారాయణ ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్లు పలువురు రాజకీయ విశ్లేషకులు భావించినప్పటికీ ఆయన మాత్రం బయటపడలేదు. ఆ తర్వాత బీజేపీ పెద్దల జోక్యంతో వివాదం సద్దుమణిగినప్పటికీ ఆయన మాత్రం స్తబ్దుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ స్వయంగా కన్నా ఇంటికి వెళ్లి కలవటం చర్చనీయాంశంగా మారింది. బయటకు పరిచయం మీద కలిసినట్లు నాదెండ్ల మనోహర్ చెబుతున్న రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరిద్దరి మధ్య భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి ఇద్దరు మధ్య సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో గతంలో కూడా ఒకటి రెండు సార్లు ముఖాముఖి సమావేశమైన సందర్భాలు ఉన్నాయని తాజాబేటికి ప్రత్యేకత లేదని మామూలుగానే ఇద్దరు స్నేహితులు గా కలిశామని చెబుతున్న త్వరలోనే వీరిద్దరూ భేటిపై స్పష్టత రానుంది.

