జనసేనకు బలం లేదు : సజ్జల రామకృష్ణారెడ్డి
చంద్రబాబు పల్లకి మోయడమే పవన్ కళ్యాణ్ అజెండా అనేది మరోసారి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ద్వారా వెళ్లడైందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును అర్జెంటుగా ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాలని పనిచేసే శక్తుల్లో పవన్ కళ్యాణ్ ఒకరన్నారు. ఇందులో ఎలాంటి ముసుగు లేదన్నారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ నీటి బుడగ లాంటిదన్నారు. 175 నియోజకవర్గాలలో పోటీ చేయలేకపోవటానికి ప్రజలే కారణమని నింద కూడా వేశారన్నారు. మీరు కొండ ఎత్తి పెడితే తాను మోస్తానని అన్నట్లుగా పవన్ వైఖరి ఉందని సజ్జల ఎద్దేవా చేశారు.

పవన్ కళ్యాణ్ మాటలు చూస్తే జీవితాంతం చంద్రబాబును ఆ తర్వాత లోకేష్ ను అధికారంలోకి తీసుకురావటమే తన లక్ష్యం అన్నట్లు ఉందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ టార్గెట్ వైఎస్సార్సీపీని దించటం అని అన్నారు. అంటే ముసుగు తొలగిపోయిందన్నారు. పవన్ కళ్యాణ్ కు ప్రజల్లో బలం లేదని పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఎన్నిక కానప్పుడు తేలిపోయిందని జనసేనకు బలం లేదని పవన్ కళ్యాణ్ అంగీకరించినట్టేనని దుయ్యబట్టారు. 2014లో అనేక అరాచకాలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన చంద్రబాబు ఒకపక్క ఉంటే అన్ని విధాల ప్రజలలో ఆధారాబిమానాలు పొందిన వైఎస్ జగన్ ఈ పక్కన ఉన్నారని సజ్జల అన్నారు. చంద్రబాబు పవన్ కుట్రలన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.

