బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకెళ్తున్న నారాయణమూర్తి అల్లుడు…
బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో అధికార కన్జర్వేటివ్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆర్థిక శాఖ మాజీ మంత్రి రిషి సునాక్.. దూసుకెళ్తున్నారు.మూడో రౌండ్‌లోనూ తిరుగులేని మెజారిటీని సాధించారు. ప్రధాని పదవి కోసం పోటీ పడుతోన్న తోటి నాయకుల కంటే అత్యధిక ఓట్లను సాధించారు. బ్రిటన్ పార్లమెంట్ సభ్యుల్లో అధిక శాతం మంది రిషి సునాక్ ప్రధాని అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా మూడో రౌండ్‌లో నిర్వహించిన ఓటింగ్‌లో రిషి సునక్‌కు 115 ఓట్లు పోల్ అయ్యాయి. 82 ఓట్లతో బ్రిటన్ మాజీ రక్షణ శాఖ మంత్రి పెన్నీ మోర్డాంట్ రెండో స్థానంలో నిలిచారు.
విదేశాంగ శాఖ మాజీ మంత్రి లిజ్ ట్రాస్‌కు మద్దతుగా 71 ఓట్లు పడ్డాయి. కెమ్మి బెడెనోచ్-58, టామ్ టుగెండ్హట్-31 ఓట్లకు పరిమితం అయ్యారు. అతి తక్కువ ఓట్లు పోల్ కావడం వల్ల టామ్ టుగెండ్హట్ ఈ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. గురువారం నాటికి బరిలో ఇద్దరే మిగులుతారు. బ్రిటన్ ప్రధానమంత్రిగా రిషి సునాక్ ఎన్నిక కావడం లాంఛనప్రాయమేననే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఇదే విషయాన్ని బ్రిటీష్ మీడియా సైతం అంచనా వేస్తోంది. రిషి సునాక్- ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడనే విషయం తెలిసిందే. పార్టీగేట్ వ్యవహారం తెర మీదికి వచ్చిన తరువాత బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు తలెత్తాయ్. ప్రధానిగా బోరిస్ జాన్సన్ కొనసాగడాన్ని అధికార కన్జర్వేటివ్ పార్టీ సభ్యులెవరూ అంగీకరించడంలేదు. ప్రధానిగా కొనసాగడాన్ని వ్యతిరేకించారు. ప్రభుత్వం నుంచి తప్పుకోవడం మొదలు పెట్టారు. దీంతో బ్రిటన్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయ్. ఐతే మొత్తం వ్యవహారం వెనుక రిషి సునాక్ ఉన్నారని బోరిస్ జాన్సన్ మండిపడుతున్నారు. బోరిస్ జాన్సన్ కేబినెట్ సహచరులందరూ రాజీనామాలు చేయడంతో… గత్యంతరం లేని పరిస్థితుల్లో జాన్సన్ తప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతున్నారు.