జగన్ అవినీతి సంపాదన రూ. 2 లక్షల కోట్లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విపక్ష టీడీపీ చీఫ్ చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ అవినీతి సంపాదన 2లక్షల కోట్ల రూపాయలు దాటిపోయిందని ఆయన అన్నారు. ఏపీలో ప్రజల జీవన ప్రమాణాలు సరిగాలేవు, వారి ఆదాయం పెరగలేదు కానీ వైసీపీ నేతల ఆదాయం మాత్రం విపరీతంగా పెరిగిపోయిందన్నారు. ఒక్క జగన్ మోహన్ రెడ్డి అవీనీతే, దగ్గర దగ్గరగా 2లక్షల కోట్ల రూపాయలు దాటిపోయిందన్నారు చంద్రబాబు. గతంలో తండ్రిని అడ్డం పెట్టుకొని జగన్ పెద్ద ఎత్తున అవినీతి చేస్తే , 11 సీబీఐ ఎంక్వైరీలు, 9 ఈడీ ఎంక్వైరీలు వచ్చాయని. వాటికి సమాధానం చెప్పలేని వ్యక్తి ఇప్పుడు అవినీతిని క్రమబద్దీకరిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఉదంతం దీనికి ఉదహారణ అని ఆయన అన్నారు. 20వేల కోట్ల రూపాయలు విలువ కలిగిన 8500ఎకరాల భూమికి టెండర్లు పిలిస్తే ఆదాయం లేని కంపెనీ 20కోట్లు కోట్ చేసిందని చంద్రబాబు చెప్పారు. ఆ కంపెనీ జగన్ మేనమామకు చెందినదని ఆయన తెలిపారు. జగన్‌ను అడిగేవారు ఏపీలో లేరని అంతా భయపడుతున్నారన్నారు.

