జగన్ దెబ్బకు.. చంద్రబాబు ఔటేనా ?
◆ నేటి నుండి వైఎస్ జగన్ ప్రతిరోజు 50 మంది కార్యకర్తలతో సమావేశం
◆ కుప్పం నుండి 50 మంది కార్యకర్తలతో తాడేపల్లిలో నేడు తొలి సమీక్ష
◆ వినూత్న కార్యక్రమం అంటున్న రాజకీయ వర్గాలు
◆ వైసీపీ పార్టీ నేతల్లో మొదలైన గుబులు
◆ ఎమ్మెల్యేలు సమన్వయకర్తలకు తెలియకుండానే కార్యకర్తల ఎంపిక
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై పూర్తిగా ఫోకస్ పెట్టారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. సీఎం జగన్ ప్రభుత్వ పాలనతో పాటు పార్టీ బలోపేతంపైనా దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దాదాపు రెండు నెలలకు పైగా ఈ ప్రోగ్రామ్ కొనసాగుతోంది. ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేయడంతో పాటు వైసీపీ కోసం పనిచేస్తున్నవారిని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో భేటీలకు మాత్రమే పరిమితం కాకుండా నేరుగా కార్యకర్తలతో భేటీ కావాలని నిర్ణయించారు. ఈమేరకు నేటి నుంచి అంటే గురువారం నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు జగన్.
ఇందుకోసం జగన్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నియోజకవర్గాన్నే ఎంపిక చేసుకున్నారు. కుప్పం నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్తలతో నేడు సమావేశం కానున్నారు. కుప్పంలో చంద్రబాబును ఓడించడమే ప్రధాన లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారు చంద్రబాబు ప్రాతినిధ్యం ఇస్తున్న కుప్పం నుండి సీఎం జగన్ తొలి సమావేశానికి శ్రీకారం చుట్టడంతో ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎన్నికలకు సంబంధించిన నిర్వహిస్తున్న తొలి కార్యక్రమం కుప్పం కావడంతో రాజకీయ వర్గాల్లో కూడా కొత్త చర్చ మొదలైంది మరోవైపు వినూత్న కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టడంతో సొంత పార్టీ నేతలు కొత్త గుబులు మొదలైంది గతంలో ఇలా సమావేశాలు నిర్వహించిన సందర్భాలు ఎప్పుడూ లేవు, వైయస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు వంటి సీనియర్ నేతలు సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా పని చేసినప్పటికీ నియోజకవర్గ స్థాయిలో సామాన్య కార్యకర్తలతో అత్యంత కీలకమైన సమావేశాలను ఏ రోజు నిర్వహించలేదు.
గురువారం మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరగనున్న సమావేశానికి కుప్పం నుంచి నేతలు కార్యకర్తలను పిలిపించారు. కుప్పంలో పార్టీ పరిస్థితి, క్షేత్రస్థాయిలో ఎంత బలంగా ఉన్నాం.. సంక్షేమ పథకాలు ఎలా ఇస్తున్నామనే అంశాలపై సీఎం వివరాలు అడిగి తెలుసుకునే అవకాశముంది. అలాగే కుప్పంలో గెలవాలంటే ఎలా ముందుకెళ్లాలని టీడీపీ వైపున్న ఓట్లను ఎలా మనవైపు తిప్పుకోవాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు ప్లస్ అయిన అంశాలేంటనే విషయాలపై సీఎం చర్చించే అవకాశముంది. ఎన్నికల్లో 175 స్థానాలు గెలవడం లక్ష్యంగా పెట్టుకున్న సీఎం జగన్ తన వేగాన్ని పెంచారు ప్రతిపక్షంలో ఉన్న బలమైన నాయకుడిని ఓడించాలంటే ఇప్పటి నుండి నియోజకవర్గం పై పూర్తిస్థాయి పట్టు సాధించాలని జగన్ ఆదేశం నిర్దేశం చేస్తూ వస్తున్నారు. సీఎం జగన్‌తో భేటీ కాబోయే 50 మంది కార్యకర్తలు జాబితాను ఎమ్మెల్యేలు సమన్వయకర్తలకు తెలియకుండానే రూపొందించినట్లు సమాచారం. సామాన్య కార్యకర్తలకు కూడా పార్టీలో అవకాశాలు వస్తాయని.. కష్టపడి పనిచేసి మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని సీఎం కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నట్లు సమాచారం. కార్యకర్తలతో సమావేశాల అనంతరం పార్టీకి మంచి మైలేజీ వచ్చి సీఎం జగన్ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.