Andhra PradeshNews

సినిమాలే ముద్దు… రాజకీయాలే వద్దు

Share with

◆ సినీ గ్లామర్ కోసం ఏపీలో బిజెపి తహతహలాడుతుందా ?

◆ తమ్ముడు పార్టీకి ఆయన వెన్నుదన్నుగా ఉంటారా

◆ చిరంజీవి దారేటు ?

ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా అని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ గా మారింది ఒకవేళ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తే ఆయన పయనం ఎటు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.సినిమా వేరు, రాజకీయం వేరు. మెగాస్టార్ చిరంజీవికి తక్కువ సమయంలోనే ఈ విషయం కూడా గతంలో అర్థమయ్యింది

సినిమా హీరోని కుల మతాలకతీతంగా అభిమానిస్తారు. రాజకీయాల్లో అలా కాదు. కులం కుంపటి రాజేస్తారు.. మతం రంగు పూస్తారు.! ప్రాంతీయ మకిలి కూడా అంటగట్టేస్తారు.

‘రాజకీయ నాయకుడు’ అనగానే బురద చల్లేయడం, రాజకీయాలు వదిలేయగానే ‘అందరివాడు’ అనడం.. ఇది చిరంజీవికి స్వయంగా అనుభవమైంది. రాజకీయాల్లోకి ఎవరైనా సేవ చేయడానికే వస్తారు. అది ఒకప్పటి మాట. ఇప్పుడు సేవ చేసేవాళ్ళకి రాజకీయాల్లో చోటు లేదు. సేవ ముసుగులో వ్యాపారాలు చేసుకునేవాళ్ళకే రాజకీయాల్లో పెద్ద పీట అని అందరికీ తెలిసిన విషయమే.

సినిమాల పరంగా ఎంతో అద్భుతమైన కెరీర్ ఉన్న చిరంజీవికి మరిచిపోలేని చేదు జ్ఞాపకం రాజకీయాలు అలవాటు లేని పాలిటిక్స్ లోకి వెళ్లి నవ్వుల పాలయ్యాడు మెగాస్టార్. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టడం అది దారుణంగా పరాభవం పాలవడం ఆ తర్వాత మూడేళ్లకే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం బదులుగా ఆయన కేంద్ర మంత్రి అవడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. తన పదవీ కాలం ముగియగానే రాజకీయాలకు పూర్తిగా స్వస్తి పలికి మళ్ళీ సినిమాల్లోకి వచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. గత ఆరేళ్లుగా కేవలం సినిమాలు తప్ప మరో ప్రపంచం లేనట్టు ఉన్నాడు మెగాస్టార్. ఇప్పుడైతే ఏకంగా నాలుగు సినిమాలు చేస్తున్నాడు. మరో రెండు మూడు సినిమాలకు కథలు సిద్ధం చేయాలంటూ దర్శకులకు సూచించాడు చిరంజీవి. ఇలాంటి సమయంలో మళ్ళీ రాజకీయాల వైపు మెగాస్టార్ అడుగులు వేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.ఎందుకంటే తాజాగా భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణలో నరేంద్ర మోదీతో పాటు ఒకే వేదికను పంచుకున్నాడు మెగాస్టార్.ఒక వేదికను పంచుకోవడం ఆసక్తికరంగా మారింది. తమ్ముడు పవన్ కళ్యాణ్ కు అభిమానులు అందరూ సపోర్ట్ చేయాలని జనసేన వెంట కార్యకర్తల్లా ఉండాలి అంటూ అభిమానులకు ఈ మధ్యే సూచించాడు చిరంజీవి. ఈ నేపద్యంలోనే చిరు అడుగులు బీజేపీ వైపు పడబోతున్నాయా అనే ఆసక్తికరమైన చర్చ కూడా ఇండస్ట్రీలో జరుగుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో తమ పార్టీని బలపరచాలంటే కచ్చితంగా సినీ గ్లామర్ కూడా అవసరమే అని నమ్ముతుంది బీజేపీ.ఈ నేపథ్యంలోనే ఏపీ నుంచి చిరంజీవిని పార్టీలోకి తీసుకుంటే మెగా బ్రదర్స్ అండదండలు ఉంటాయని కమలనాధులు నమ్ముతున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే చిరంజీవి మాత్రం అలాంటిదేం లేదు తనకు రాజకీయాలు అవసరం లేదు కేవలం సినిమాలతో బిజీగా ఉంటానని సన్నిహితులతో చెబుతున్నట్లు తెలుస్తోంది. 10 ఏళ్ళు రాజకీయాల్లోకి వెళ్లాను ఇక జీవితంలో మళ్లీ అటువైపు వెళ్ళను అంటున్నాడు మెగాస్టార్.
హాయిగా వున్న ప్రాణాన్ని సంకటంలో చిరంజీవి ఎందుకు పెట్టుకుంటారు.? ఈసారి ఛాన్సే లేదు. నిజానికి, పవన్ కళ్యాణ్ కూడా తన అన్న నేర్చుకున్న పాఠాన్నే అవగతం చేసుకుంటే సరిపోతుందని అందరు భావన.సినిమాల్లో ‘గాడ్ ఫాదర్’ అంటే, జనం విజిల్స్ వేస్తారు. రాజకీయాల్లో గాడ్ ఫాదర్ అవుదామనుకుంటే.. షరామామూలే.! సో, చిరంజీవి ఆ రిస్క్ మళ్ళీ చేసే అవకాశమే లేదని విశ్లేషకులు భావిస్తున్నారు మరి చిరంజీవి ఏం చేస్తారో వేచి చూడాల్సి ఉంది.