గాలికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన… జగన్ సర్కార్
గతంలో తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓబులాపురం మైనింగ్ వ్యవహారం..తాజాగా మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈ ఓబులాపురం మైనింగ్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా ఉన్న కర్ణాటక మాజీ మంత్రి గాలిజనార్థన్ రెడ్డి భారీగా ఓబులాపురంలో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. వీటి కారణంగా చాలా కాలం పాటు కర్ణాటక,ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న ఆయన కంపెనీ ఓఎంసీ (ఓబులాపురం మైనింగ్ కంపెనీ) మైనింగ్ కార్యకపాలను ప్రభుత్వం అప్పట్లో నిషేధించింది. అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్థన్ రెడ్డిని అరెస్టు కూడా చేసింది.
ఈ నేపథ్యంలో మైనింగ్ తవ్వకాలలో అక్రమాలు ఏమి జరగ లేదని..అవన్నీ కల్పితాలు మాత్రమేనని ఓఎంసీ కంపెనీ అప్పటి ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించింది. అయినప్పటికీ ఉపయోగం ఏమి లేకపోవడంతో దాదాపు ఒక దశాబ్దం పాటు ఓఎంసీ ఎటువంటి తవ్వకాలను చేపట్టలేదు. అయితే చాలాకాలం తరువాత మళ్ళీ ఇప్పుడు ఓబులాపురంలో మైనింగ్ తవ్వకాలను తిరిగి ప్రారంభించేందుకు అనుమతివ్వాలని గాలిజనార్థన్ రెడ్డి ఓఎంసీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం నుంచి సానుకూలమైన స్పందన లభించింది. ఆంధ్రప్రదేశ్ కర్ణాటకకు సంబంధించిన సరిహద్దు విషయంలో ఇటీవల స్పష్టత వచ్చిన విషయం తెలిసిందే.దీని కారణంగా తమ భూభాగంలో జరిపే తవ్వకాల విషయంలో తమకు ఎటువంటి అభ్యతరం లేదని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించింది.
ఓఎంసీ విజ్ఞప్తిని మన్నించిన సుప్రీంకోర్టు దీనిపై విచారణ జరపాలని..ఇప్పటికే ఓఎంసీ కంపెనీపై నమోదైన మరో కేసును విచారిస్తున్న కోర్టుకు ఈ కేసును కూడా విచారించాలని సూచించింది. ఈ మేరకు గాలి ఓఎంసీ పై ఈ రోజు విచారణ ప్రారంభమయ్యింది. గాలి జనార్థన్ రెడ్డికి ముందు నుంచి ఏపీ సీఎం జగన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో జగన్ ప్రభుత్వం గాలిజనార్థన్ రెడ్డి ఓఎంసీ పునఃప్రారంభానికి అనుమతులు ఇచ్చిందని స్పష్టమవుతుంది. అయితే గాలిజనార్దన్ రెడ్డి ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తులు,మనీల్యాండరింగ్ కేసుల్లో సీబీఐ దర్యాప్తు ఎదుర్కొంటున్నారు.