ముందస్తు ఎన్నికలకే జగన్ మొగ్గు ?
రాష్ట్ర శాసనసభ ఎన్నికలను నిర్ణీత గడువు కంటే కనీసం ఆరు నెలలు ముందు జరిపించాలని వైఎస్ జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అది ఆరు నెలలా? అంతకంటే ముందా అన్నది చూడాల్సి ఉంది. తెలంగాణ శాసనసభ ఎన్నికలతో కలిపి ఆంధ్రకు ఎన్నికలు జరిపించాలని ఎలక్షన్ కమిషన్‌కు జగన్ విజ్ఞప్తి చేయబోతున్నారట. 2023 డిసెంబర్ లోపల తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి కూడా ఎన్నికల తేదీ కంటే ముందే జరపాలని ఆలోచన చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆరు నెలలు ముందుగా ఎన్నికలు వస్తే మన రాష్ట్ర శాసనసభ ఎన్నికల కూడా వాటితో పాటు జరపాలని జగన్ భావిస్తే ఒక సంవత్సరం ముందే ఏపీలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 2019 ఏప్రిల్‌లో ఏపీ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. మే 30వ తేదీన వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అసలు నిర్ణీత వ్యవధి ప్రకారం అయితే 2024 ఏప్రిల్‌లో ఏపీలో ఎన్నికలు జరగాలి. అప్పటికి పార్లమెంట్ గడువు కూడా తీరిపోతుంది రెండింటికి కలిపి ఎన్నికలు పెడతారు. అలా చేయటం జగన్‌కి ఇష్టం లేదు.

పార్లమెంటు ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితుల్లో అప్పటికి ఏపీలో కూడా కొన్ని స్థానాలు కావాలని కోరుకునే పక్షంలో నరేంద్ర మోదీ తెలుగుదేశంతో జతకట్టే ప్రమాదం ఉందని గ్రహించిన జగన్ ముందుగా అసెంబ్లీ ఎన్నికలు జరిపి తరువాత పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలని ఆలోచనలో ఉన్నారట. తెలుగుదేశంతో నరేంద్ర మోదీ జతకడితే తెలుగుదేశం బలపడిపోతుందని వారు కూడా స్వేచ్ఛగా ఎన్నికల ప్రచారం నిధులు పంపకం చేసుకునే వెసులుబాటు కలుగుతుందని ఇది చాలా ప్రమాదకరమని జగన్ ఆలోచనలో ఉన్నారట. కానీ నరేంద్ర మోదీతో జగన్‌కు చక్కని బంధం ఉన్న నేపథ్యంలో ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేకపోయినా కేంద్రంలో ప్రభుత్వానికి విశ్వసనీయ మిత్రుడుగా ఉంటానని ఇప్పటికే పలు సందర్భాల్లో జగన్ తెలిపారట. నరేంద్ర మోదీ కూడా ఈసారి ఎన్నికల్లో చంద్రబాబుకు కాకుండా జగన్‌కే సపోర్టుగా నిలుస్తారని ప్రచారమూ ఉంది. కేంద్రంతో సఖ్యతగా ఉంటే తెలుగుదేశం కదలికలను నిధుల ప్రవాహాన్ని నిరోధించవచ్చని జగన్ ఉద్దేశంగా ఉంది.

ఈ ఆలోచనలతో పాటు జగన్ ఇప్పటి నుంచి ఎన్నికల హడావిడి మొదలుపెట్టారు. ఎమ్మెల్యేలను కార్యకర్తను పిలిచి స్వయంగా మాట్లాడుతున్నారు. పార్టీలోని పెద్దలకు సీనియర్లకు కూడా తన ప్రణాళికలను వివరించి కౌన్సిలింగ్ చేసి ఎన్నికలకు సమాయత్తం అవ్వాలని సూచనలు ఇస్తున్నారు. పార్టీలో మరమ్మత్తులు ప్రారంభించిన జగన్ ఈసారి 50కి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆ స్థానాల్లో ఇప్పటినుంచే కొత్త అభ్యర్థులను ముందుకు తెస్తున్నారు. ఇప్పటికే తాడికొండలో అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను జగన్ నియమించారు. ఉన్న ఎమ్మెల్యేలను మార్చి కొత్త అభ్యర్థులను ప్రకటిస్తే రాష్ట్రంలో గగ్గోలు రేగుతుందన్న భయం ఉన్నప్పటికీ మార్చకపోతే అధికారం కోల్పోతామన్న భావనలో కచ్చితంగా జగన్ అభ్యర్థులను మారుస్తారని అంటున్నారు. కానీ 2009 ఎన్నికల సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఈ ప్రయత్నం చేశారు. చంద్రబాబు కూడా ఒకటి రెండు ప్రయత్నాలు చేశారు. అవేమి సత్ఫలితాలు ఇవ్వలేదు. కొత్తగా వచ్చిన అభ్యర్థులకు పాత ఎమ్మెల్యేలు చుక్కలు చూపించడం గతంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది.

ప్రజలలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ప్రబలుతోందన్న వార్తలు ముఖ్యమంత్రి చెవికి కూడా చేరాయి. అయితే వ్యతిరేకత ఎమ్మెల్యేల మీద తప్ప తన మీద కానని ఆయన నమ్ముతున్నారు. ఎమ్మెల్యేలను మార్చి పారేస్తే ప్రజలు మళ్ళీ తనకు పట్టం కడతారని జగన్ భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో తనతో పోటీపడి ఎన్నికలను ఢీకొనే శక్తి లేదని జగన్ అంచనా. గత మూడు ఏళ్లుగా పార్టీ ఎమ్మెల్యేలు దూకుడుగా వ్యవహరించి పోలీసుల బల ప్రయోగంతో తెలుగుదేశం కార్యకర్తలను నిర్వీర్యం చేశారని వారు తేరుకునే లోగా ఎన్నికలు జరిపిస్తే మంచిదని జగన్ అభిప్రాయం. గడువు వరకు ఎన్నికలను వాయిదా వేస్తే ఎన్నికల ముందు ఎమ్మెల్యేలు తమ స్పీడ్ తగ్గిస్తారు కాబట్టి తెలుగుదేశం నేతలు కార్యకర్తలు కోలుకునే అవకాశం ఉంటుందని ముందుగానే ఎన్నికలకు వెళ్తే గెలుపు ఖాయమని జగన్ ఆలోచన చేస్తున్నారట. మరి జగన్ వ్యూహాలు ఫలించి ఈసారి ఎన్నికల్లో మళ్లీ అధికార పీఠం కైవసం చేసుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.


 
							 
							