వెన్నుపోటు దినం నిరసనలకు జగన్ పిలుపు
కూటమి పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని… ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం ఎంతమాత్రం మంచిది కాదని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం తెనాలిలో పర్యటించిన ఆయన.. నడిరోడ్డులో యువకులపై పోలీసుల ధర్డ్ డిగ్రీ దాష్టికాన్ని ఖండిస్తూ మీడియాతో మాట్లాడారు. మా హయాంలో ప్రతీ వర్గానికి సంక్షేమం అందింది. కానీ, చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ నీరుగారింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద 3,600 కోట్ల రూపాయిలు బకాయిలు పేరుకుపోయాయి. విద్యారంగం పూర్తిగా నాశనమైంది. వైద్య రంగం దివాళా తీసింది. రైతు భరోసా లేదు. ఉచిత పంటల బీమా, ఈ-క్రాప్ లేదు. ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం ఏమాత్రం మంచిది కాదు. ఎంత త్వరగా సాగనంపితే ప్రజలకు అంత మేలు. రేపు రాష్ట్రవ్యాప్తంగా వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నాం. ప్రతీ ఒక్కరూ ఈ నిరసనల్లో పాల్గొనాలి అని జగన్ పిలుపు ఇచ్చారు.

